విజయవాడలో రోడ్ల విస్తరణలో భాగంగా ఆలయాల తొలగింపుపై తెదేపా, భాజపా నేతల మధ్య యుద్ధం మొదలవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఈ విషయంలో ఎవరు మాట్లాడాలనుకొన్నా తనతోనే మాట్లాడాలని, ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవద్దని కోరారు. ముఖ్యమంత్రి తెదేపా నేతలెవరూ రాష్ట్ర భాజపా నేతలపై విమర్శలు చేయవద్దని హెచ్చరించారు. రోల్డ విస్తరణలో భాగంగా కొన్ని చోట్ల ఆలయాలు తొలగించవలసి వచ్చినప్పటికీ వాటిని మళ్ళీ వేరొకచోట పునర్నిరించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులతో చర్చించకుండా వారి అనుమతి లేకుండా ఆలయాలని తొలగించవద్దని ఆయన అధికారులని హెచ్చరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం 5మంది మంత్రులతో కూడిన కమిటిని ఏర్పాటు చేశారు. వారిలో భాజపాకి చెందిన దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాల రావు కూడా ఉన్నారు. ఆయన ద్వారా వారు రాష్ట్ర భాజపా నేతలతో కూడా మాట్లాడుతున్నారు.
రోడ్లు విస్తరణ కార్యక్రమం మొదలుపెట్టి మొదటి ఆలయం కూల్చి వేసినప్పుడే వైకాపా ఆందోళన వ్యక్తం చేసింది కానీ ప్రభుత్వం మేల్కొనడానికి ఇంత సమయం పట్టింది. ఈలోగా అధికారులు మరిన్ని ఆలయాలు కూల్చివేయడంతో ఇప్పుడు ఈ సమస్యకి రాజకీయ రంగు పులుముకొంది. వైకాపా దీనిని ఒక మంచి అవకాశంగా తీసుకొని హిందువులని రెచ్చగొట్టేవిధంగా సాక్షిలో వార్తలు, అభిప్రాయలు ప్రచురిస్తోంది. బహుశః వైకాపాకి కాంగ్రెస్ పార్టీ కూడా తోడవవచ్చు.
ప్రతిపక్షాలే కాకుండా మిత్రపక్షమైన భాజపా కూడా ప్రభుత్వంపై కత్తులు దూస్తుంటే, తెదేపా నేతలు వెనక్కి తగ్గకపోగా వారిపై కూడా ఎదురుదాడికి దిగి సమస్యని ఇంకా జటిలం చేసి పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది. తెదేపా ప్రభుత్వంలో చాలామంది సీనియర్ నేతలున్నారు. ప్రభుత్వంలో కొమ్ములు తిరిగిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇన్-చార్జ్ లు, ఉన్నతాధికారులు ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ రోడ్ల విస్తరణ అనే ఒక చిన్న సాధారణమైన పనిని సజావుగా చేయలేకపోయారు. తమ అలసత్వం, మాటలతో దానినీ ఒక పెద్ద సమస్యగా మార్చివేస్తున్నారు. ఈవిధంగా ప్రతీపనిని, సమస్యనీ కూడా ముఖ్యమంత్రే స్వయంగా చూసుకోవలసిరావడం చూస్తుంటే ఇంకా వారందరూ ఉండి ఏమి ప్రయోజనం? అసలు వారందరూ ఏమి చేస్తున్నారనే అనుమానం కలుగకమానదు.