ప్రత్యేక హోదా సంగతి తేల్చే వరకు డిల్లీ వెళ్లనని శపథం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల్లో డిల్లీ వెళ్ళబోతున్నారని తాజా సమాచారం. త్వరలో ప్రారంభం కానున్న కృష్ణ పుష్కరాలకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులని, సుప్రీం కోర్టు చీఫ్ జస్తిస్ట్ టీఎస్ టాకూర్ ని స్వయంగా ఆహ్వానించేందుకు డిల్లీ వెళుతున్నట్లు సమాచారం వచ్చింది. అయితే డిల్లీ వెళ్లేందుకు అది ఒక వంక మాత్రమేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవ్వాళ్ళ ఉదయం ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆయనతో ఫోన్ లో “అన్ని విషయాలు” మాట్లడానని చెప్పారు. “అన్ని విషయాలు” అంటే ప్రత్యేక హోదా బదులు కేంద్రం ఇవ్వదలచుకొన్న ప్రత్యేక ఆర్దిక ప్యాకేజి అని వేరే చెప్పనవసరం లేదు. అరుణ్ జైట్లీ నిర్దిష్టమైన హామీ ఇచ్చినందునే చంద్రబాబు నాయుడు డిల్లీ వెళుతున్నట్లుగా భావించవచ్చు. కనుక డిల్లీ వెళ్లినప్పుడు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వబోయే ప్రత్యేక ప్యాకేజితో సహా విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం వంటి ఇతర హామీల అమలుగురించి అరుణ్ జైట్లీ నిర్దిష్టమైన ప్రకటన చేయవచ్చని ఆశించవచ్చు.