ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులకి, ఎమ్మెల్యేలకి మార్కులు ర్యాంకులు ఇస్తుంటే, ప్రధాని నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడికి ర్యాంకు నిర్ధారించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక కధనం ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి దేశంలో నెంబర్:1 ర్యాంక్, ఆ తరువాత వరుసగా మధ్యప్రదేశ్ (శివరాజ్ సింగ్ చౌహాన్), ఛత్తీస్ ఘడ్ (రాదా రమణ సింగ్), గుజరాత్ (ఆనందీ బెన్), డిల్లీ (అరవింద్ కేజ్రీవాల్) లకి ర్యాంకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి 13వ ర్యాంక్ ఇచ్చినట్లు పేర్కొంది. విభజన కారణంగా చాలా దారుణంగా దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతి కష్టం మీద అభివృద్ధి చేస్తున్నప్పటికీ తనకి 13వ ర్యాంక్ ఇచ్చినట్లు తెలుసుకొని చంద్రబాబు నాయుడు చాలా బాధపడ్డారని తెదేపాలో టాక్!
కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబు నాయుడు గరించి చెప్పిన మాటలు ఆయన ఆవేదనని పూర్తిగా తుడిచిపెట్టేసి ఉండవచ్చు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ యాక్టివ్. ఆయన చురుకుదనం చూస్తే నాకే చాలా ముచ్చట వేస్తుంది. దక్షిణాది రాష్ట్రాలలో అందరికంటే ఆయన చాలా చురుకుగా పనిచేస్తున్నారని నేను భావిస్తున్నాను. కేంద్రం నుంచి నిధులు, పధకాలు, ప్రాజెక్టులు రాబట్టుకోవడంలో ఆయనకీ ఆయనే సాటి. కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్న పధకాలు, ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాల గురించి కేంద్రానికి తెలియజేస్తూ కేంద్రంతో చక్కగా అనుసంధానం అయ్యుంటారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన పదకాలని వీలైనంత త్వరగా రాష్ట్రంలో వినియోగించుకొనేందుకు చంద్రబాబు నాయుడు చాలా ఆసక్తి చూపుతుంటారు. దేశంలో విద్యుత్ పొదుపు చర్యలలో భాగంగా మా ప్రభుత్వం ఎల్.ఈ.డి.బల్బులు ప్రవేశపెడితే, అందరికంటే ముందు చంద్రబాబు నాయుడే వాటిని రాష్ట్రంలో వినియోగించేలా చేశారు. కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలతో కేవలం రెండేళ్ళలోనే రాష్ట్రంలో విద్యుత్ సమస్యల్ని అరికట్టడమే కాకుండా, మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చగలిగారు. విద్యుత్ రంగంలో దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చాలా అభివృద్ధి సాధిస్తోంది. దీని కంతటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదల, ఉత్సాహం, చురుకుదనమే,” అని కేంద్రమంత్రి పీయూష్ గోయాల్ చంద్రబాబు నాయుడిపై ప్రశంశల వర్షం కురిపించారు.
పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పనితీరుని అంతగా మెచ్చుకొంటుంటే మరి ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకి 13వ ర్యాంక్ ఎందుకు ఇచ్చినట్లు? ఇంతకీ చంద్రబాబు నాయుడి ర్యాంక్ ఎంత? కేంద్రమే చెప్పాలి.