ప్రధానమంత్రి నరేంద్రమోడీ టీకా వేయించుకున్నారు. పొద్దున్నే … ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే కాన్వాయ్‌తో రోడ్డు మీదకు వచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎక్కడా ట్రాఫిక్ ఆపనీయలేదు. నేరుగా ఎయిమ్స్‌కు వెళ్లి టీకా వేయించుకున్నారు. ఆస్పత్రిలోనూ పెద్ద పెద్ద ఏర్పాట్లు లేవు. మామూలుగా వీఐపీలకు టీకాలు ఎలా వేస్తారో అలా మాత్రమే ఏర్పాట్లు ఉన్నాయి. ఇద్దరు నర్సులు టీకా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చాలా సింపుల్‌గా హంగామా లేకుండా టీకా వేయించుకున్నారని సోషల్ మీడియాలోనూ ప్రశంసలు వచ్చాయి. మోడీ జనవరి పదహారో తేదీన టీకా వేయించుకున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ ఒకటో తేదీన టీకా వేయించుకున్నారు. ఆయన ఆస్పత్రిలో కాకుండా తన ఇనిషీయేటివ్ అయిన వార్డు సచివాలయంలో వేయించుకున్నారు. ఎక్కడైనా టీకానే కదా అనుకోవచ్చు కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. గుంటూరులో భారత్ పేట అనే వార్డుతో పాటు చుట్టుపక్క వార్డులన్నీ సీఎం జగన్ వస్తున్న కారణంగా క్లోజ్ అయిపోయాయి. నగరంలోకి సీఎం ప్రయాణించే దారి మొత్తం రెండు వైపులా కర్రలు అడ్డం కట్టేశారు. రాకపోకల్ని నిలిపివేశారు. ఇళ్లలోని వాళ్లు రోజువారీ అవసరాలకు కూడా టీకా వేయించుకుని వెళ్లే వరకూ బయటకు రాలేకపోయారు. ఇక టీకా కేంద్రంలో భారీ ఏర్పాట్లు ఉన్నాయి. టీకా వేయించుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టి…. టీకాను తానే ఇస్తున్నట్లుగా క్లెయిమ్ చేసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీనే.. చాలా సింపుల్‌గా వ్యాక్సిన్ తీసుకుని ప్రజలెవరూ అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదని సందేశం లేస్తే.. సీఎం జగన్ మాత్రం…భారీ హంగామా చేశారు. ఆయన టీకా కార్యక్రమం ఏమో కానీ ప్రజలు మాత్రం ఇబ్బందిపడ్డారు. సీఎంకి టీకా వేయించదల్చుకుంటే.. ఆయన కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కన్నా.. ఇంటికే వెళ్లి టీకా ఇచ్చినా మీడియాలో వస్తుంది. కానీ పని గట్టుకుని ఆయన వార్డు సచివాలయానికి రావడం వల్ల గుంటూరులో గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడమే కాదు.. కొన్ని వార్డుల ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.