మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీలో సీఎం జగన్ సహా వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు పరిధి దాటిందని సీఎం జగన్ తేల్చేశారు. శాసనసభకు సర్వాధికారాలు ఉన్నాయని మూడు రాజధానులు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తన ప్రసంగం సందర్భంగా న్యాయవ్యవస్థ పై సీఎం జగన్ ఘాటుగా స్పందించారు. మెరుగైన చట్టం చేస్తామని ఊహించి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వ పాలసీలు నచ్చలేదు కాబట్టే 151 స్థానాలు ప్రజలు ఇచ్చారని జగన్ తెలిపారు. హైకోర్టు తీర్పు సరి కాదని సభ ద్వారా చెబుతున్నామన్నారు. రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్ర లేదన్నారు. ఆ విషయం హైకోర్టుకే కేంద్రం చెప్పిందన్నారు. రాజధాని నగరంతోపాటు ఆ ప్రాంతంలో చూపిన మాస్టర్ ప్లాన్ కేవలం కాగితాలపైనే, గ్రాఫిక్స్ రూపంలోనే ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. భవిష్యత్‌లో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలనే 15 నుంచి 20 లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడు గమనించాలన్నారు.
జగన్ కంటే ముందు మాట్లాడిన పలువురు న్యాయవ్యవస్థపై మండిపడ్డారు. జడ్జిమెంట్‌ను పరిశీలించాల్సిన బాధ్యత శాసనసభకు ఉందని బుగ్గన స్పష్టం చేశారు. ఇప్పుడు అమరావతి తీర్పులో చట్టాలు చేయకూడాదని చెప్పడం కరెక్ట్ కాదు. రెండు అంశాలపై జడ్జిమెంట్ ఆధార పడి ఉంది. సీఆర్డీఏ చట్టం వెనక్కి తీసుకున్న తర్వాత కాజ్ ఆఫ్ యాక్షన్ లేదు. చట్టమే లేనప్పుడు మోసం అనే పదం ఎక్కడ వచ్చిందని బుగ్గన ప్రశ్నించారు.
మరో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టుల్లో ఏ బెంచ్‌పైకి వెళ్తే ఎలాంటి తీర్పు వస్తుందో చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. తాము ప్రజలకు జవాబుదారీ అని న్యాయమూర్తులు ఎవరికి జవాబుదారి అని చెవిరెడ్డి ప్రశ్నించారు. వారికి నైపుణ్యాలు ఉన్నాయో లేదో నిర్దారించేదెవరు…? అని చెవిరెడ్డి ప్రశ్నించారు. కార్యనిర్వాహక ఎంపిక చాలా కఠినంగా ఉంటుంది. అలాంటప్పుడు న్యాయవ్యవస్థను పరిరక్షించే జడ్జిల ఎంపిక మరింత కఠినంగా ఉండాలన్నారు. యూపీఎస్సీ తరహాలోనే జడ్జిల నియామకం ఉండాలన్నారు.
చర్చను ప్రారంభించిన ధర్మాన ప్రసాదరావు ఒక వ్యవస్థను ఇంకో వ్యవస్థ పలచన చేస్తుంటే ఇది పరువు తీసుకోవడమే కాకుండా తగని పని అని ఆయన చెప్పారు. శాసనాలు చేసే అధికారం అసెంబ్లీ, పార్లమెంట్‌కు తప్ప వేరే వాళ్లకు లేదు. రాజ్యాంగ వ్యతిరేకమైనప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవచ్చు. దీన్ని పాటించాలి. కోర్టులు ప్రభుత్వాన్ని నడపలేవు అని చాలా జడ్జిమెంట్స్‌లో చెప్పారన్నారు. ప్రభుత్వం మారితే విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని చెప్తే ఎలా అని ప్రశ్నించారు.