కుప్పంను పులివెందుల చేస్తానంటూ సీఎం జగన్ అక్కడి ప్రజలకు చెబుతున్నారు. చంద్రబాబు ఏమీ చేయలేదని.. గత మూడున్నరేళ్లలో తాను చాలా చేశానని కూడా గొప్పగా చెబుతున్నారు. అయితే చంద్రబాబు మరుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారని టీడీపీ నేతలు లెక్కలు చెబుతున్నారు. వీడియోలు ప్రదర్శిస్తున్నారు. సుందరమైన కుప్పం.. అద్భుతమైన రోడ్లు.. మెడికల్ కాలేజీ కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. అక్కడి ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలకు లోటు లేదు. వాటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లరు.
కళ్ల ముందే కుప్పం అభివృద్ధి – పులివెందులలో కూడా !
కుప్పంలో ఉపాధి అవకాశాలు పెంచడానికి చంద్రబాబు పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకు వచ్చారు . బెంగళూరులో చాలా మంది ఉపాధి పొందుతూ అప్ అండ్ డౌన్ చేసేలా రైతు, బస్సు సౌకర్యాలను కూడా చంద్రబాబాబు ఏర్పాటు చేయించగలిగారు. కుప్పం ప్రజల జీవన ప్రమాణాలు ఎలా చూసినా బాగా మెరుగుపడ్డాయి. ఇది కళ్ల ముందు కనిపించే నిజం. మరి పులివెందులలో పరిస్థితి ఎలా ఉంది ? కుప్పంలో చంద్రబాబు కంటే ఎక్కువగా పులివెందులలో వైఎస్ కుటుంబం పట్టు సాధించింది. ఆ కుటుంబమే పెత్తనం చేస్తూ వస్తోంది. మరి పులివెందులలో ఏం సౌకర్యాలు ఉన్నాయి ? ఎలాంటి అభివృద్ధి జరిగింది.
బస్టాండే పులివెందుల అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ !
కుప్పంలో జమానా కిందటే మంచి బస్టాండ్ ఉంది. కానీ పులివెందులలో ఇప్పటికీ బస్టాండ్ లేదు. కడతామని విమానం ఆకారంలో ఉండే గ్రాఫిక్స్ ను సీఎం జగన్ విడుదల చేసి నాలుగేళ్లవుతోంది. కానీ సగం కూడా పూర్తి కాలేదు. ఇప్పటి జమానా కిందటే కుప్పానికి మెడికల్ కాలేజీ వచ్చింది. ఇప్పుడే పులివెందులలో పునాదులు పడ్డాయి. మరుమూల ప్రాంతమైన మంచి ఇంజినీరింగ్ కాలేజీలు. ఆస్పత్రులు.. పరిశ్రమలు ఉన్నాయి. పులివెందులలో ఎలాంటి అభివృద్ధి లేదని.. జగన్ వందల కోట్ల అంచనాలతో జీవోలు విడుదల చేశారు. ఒక్క పనీ కాలేదు. అభివృద్ధి అంతా పేపర్లపైనే ఉంటుంది. వైఎస్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో పులివెందులలో మంచి పనులు జరిగాయి. పెద్ద ఎత్తున వందలు, వేల కోట్లు కుమ్మరించారు. కానీ ఎక్కువగా కమిషన్లకే పోయాయి. పనులన్నీ పాతబడిపోయాయి.
పులివెందులలో అడుగడుగునా వైఎస్ ప్యామిలీ ప్యాలెస్లు… అదే అభివృద్ధి !
కుప్పంలో జరగని అభివృద్ధి.. పులివెందులలో జరిగిన అభివృద్ధి ప్యాలెస్లు. సీఎంగా బిజీగా ఉండే చంద్రబాబు కుప్పంలో ప్యాలెస్ కట్టుకోలేకపోయారు. కానీ వైఎస్ ఫ్యామిలీ మాత్రం ఇడుపుల పాయలో ప్రారంభించి కడప వరకూ ప్రతి ఒరవై కిలోమీటర్లకూ ఓ ప్యాలెస్ నిర్మించారు. చంద్రబాబు చేయలేకపోయిన అభివృద్ధి.. వైఎస్ కుటుంబం చేసుకున్న అభివృద్ధి అదొక్కటే. కుప్పంలో ప్రజలకు మేలు జరిగితే.. పులివెందులలో వైఎస్ కుటుంబం మాత్రమే బాగుపడింది. అదే అభివృద్ధి జగన్ చేస్తానంటున్నారు.