రూ. పది కోట్లు పథకం సొమ్ము బటన్ నొక్కడానికి రూ. యాభై కోట్లు పెట్టి ప్రకటనలు ఇచ్చే జగన్ రెడ్డి సర్కార్ నిర్వాకాలు ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు .. అలాంటిది.. తాము వరద బాధితులకు ఫోటోలు తీసుకోకుండా సాయం చేశామంటే ఎవరైనా నమ్ముతారా ? . ఫోటోలు కూడా తీసుకోలేదంటే అసలు సాయం చేయలేదనే అర్థం. కానీ చేశామని చెప్పుకోవడానికి ఫోటోలు తీసుకోలేదంటూ.. జగన్ రెడ్డి సమర్థించుకున్నారు. వరద తగ్గిపోయిన వారం తర్వాత పోలవరం ముంపు ప్రాంతాలైన కూనవరం, వీఆర్ పురం మండలాల్లో జగన్ రెడ్డి పర్యటించారు.
తాను ఏం చేశారో చెప్పుకోకుండా. గతం కంటే భిన్నంగా చేశామని అధికారులు వారం రోజుల పాటు ఇక్కడే ఉన్నారని.. అధికారులకు కావాల్సిన వనరులు ఇచ్చి వారం రోజులుల పాటు సహాయ కార్యక్రమాలకు ఏ మాత్రం అలసత్వం లేకుండా చేయాలని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను కూడా పొగుడుకున్నారు. అసలు సాయమే అందలేదు మహా ప్రభో అని బాధితులు పది రోజుల పాటు గగ్గోలు పెడితే..అందరికీ సాయం చేశామని నమ్మించడానికే అన్నట్లుగా జగన్ వెళ్లి పదేపదే సాయంచేశామని చెప్పుకున్నారు గ్రామాల్లో తిరిగినప్పుడు తమకు రావాల్సిన సాయం అందలేదనే మాట ఎవరైనా అంటే అది బాగుండదని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.
పోనీ ఈ వరద సాయం కాదు.. అసలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తే తమ దారి తాము చూసుకుటామని బాధితులు అన్నా ఆయనకు ఎక్కలేదు. ఎన్నికల్లో గెలవక ముందు అక్కడికి వచ్చి టీడీపీ ఇచ్చినదానికన్నా ఎకరాకు పది లక్షలు ఎక్కువ ఇ్సతామని చెప్పారు. నాలుగున్నరేళ్లలో కొంత కూడా సాయం చేయలేదు. ఇప్పుడు ఆరేడు నెలల్లో పరిహారం ఇస్తామని చెప్పుకొచ్చారు. ఆరేడు నెలల తర్వాత జగన్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందో లేదో చెప్పడం కష్టమే.
వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలు నిలదీయకుండా ముందుగానే పోలీసులలు పక్కా ఏర్పాట్లు చేశారు. ఎంపిక చేసిన వారిని మాత్రమే సీఎం దరి దాపులకు రానిచ్చారు.