పేదలందరికీ.. సెంటు.. సెంటున్నర చొప్పున పంచి.. ఇళ్లు కూడా ఊళ్లను నిర్మిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… ఈ సారి మధ్య తరగతి కోసం వినూత్నమైన ఆలోచన చేశారు. మున్సిపల్ శాఖపై నిర్వహించిన ఈ సమీక్షలో జగన్మోహన్ రెడ్డి.. తన ఆలోచనను అధికారుల ముందు ఉంచారు. మున్సిపాలిటీలలో మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు… లే ఔట్లు అభివృద్ధి చేయాలని… క్లియర్ టైటిల్‌తో తక్కువ ధరకు వాటిని ప్రజలకు అందించాలన్నారు. ఇళ్లు లేని మధ్యతరగతి ప్రజలు… ప్రభుత్వం ఇచ్చే పేదల ఇంటి పథకం కింద స్థలం పొందలేకపోయారు. వారిలో అసంతృప్తి ఉంది… ఆ అసంతృప్తిని..తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. తాను చెప్పిన అంశంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
వైఎస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రయత్నం జరిగింది. రాజీవ్ స్వగృహ పేరుతో భారీ అపార్టుమెంట్లను మధ్యతరగతి ప్రజలకోసం కట్టించారు. కానీ అవి నిర్వహణ సమస్యల వల్ల ఫెయిలయ్యాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అపార్టుమెంట్ సంస్కృతికి వ్యతిరేకంలా ఉన్నారు. పేదలకు ఆయన బహుళ అంతస్తుల్లో ఇళ్లు ఇవ్వడం కన్నా.. ఎంతో కొంత స్థలంలో ఇళ్లు ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే.. ఇళ్ల పథకాన్ని రూపొందించారు. ఇప్పుడు మధ్యతరగతి వారికి అందుబాటులోకి తేవాలనుకుంటున్న ఇళ్లు కూడా అపార్టుమెంట్లు కాకుండా.. గేటెడ్ కమ్యూనిటీల్లోలా ఉండేలా ప్లాన్ చేసే అవకాశం ఉంది.
అయితే… ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఆరోపణలు విమర్శలు వచ్చే అవకాశం ఉంది. గతంలో అమరావతిలో గత ప్రభుత్వం హ్యాపీనెస్ట్ పేరుతో ఇళ్లను అమ్మకానికి పెడితే.. తీవ్రమైన ఆరోపణల్ని వైసీపీ చేసింది. అయితే.. అది లాభాల కోసం చేసిందని.. తాము ప్రజలకు ఇంటి వసతి కల్పించడానికి చేస్తున్నామని వైసీపీ వాదించే అవకాశం ఉంది. విమర్శలు ఆరోపణలు ఎన్ని వచ్చినా మార్కెట్ రేటు గురించి పట్టించుకోకుండా.. ప్రజలకు నామమాత్ర ఖర్చుతో మంచి ఇళ్లు నిర్మించి ఇస్తే.. అది ప్రభుత్వానికి గొప్ప పేరు తెచ్చి పెడుతుంది.