ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పిన తరువాత రాష్ట్రంలో మాల్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీల అమలు గురించి ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం చర్చించడానికి డిల్లీ వెళ్ళబోతున్నారు. రాష్ట్రానికి ఇంకా ఏమేమీ ఇస్తారు? ఏమి ఇవ్వదలచుకోలేదు? అనే విషయలపై స్పష్టత కోరుతారని, దానిని బట్టే తమ భవిష్య కార్యాచరణ ఉంటుందని తెదేపా నేతలు చెపుతున్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇవ్వబోమని ఇప్పటికే కేంద్రం చాలాసార్లు తేల్చి చెప్పింది. కనుక చంద్రబాబు ప్రధానిని కలిసినా ఆయనా మళ్ళీ అదే చెప్పవచ్చు. అప్పుడు భాజపా పట్ల తెదేపా వైఖరిలో ఏమయినా మార్పు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. తెగతెంపులు చేసుకొంటే రెండు పార్టీలకు చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు, ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు కనుక మధ్యేమార్గంగా రాష్ట్రానికి మళ్ళీ కొంత నిధులు విడుదల చేసి ఈ వేడిని చాలార్చే ప్రయత్నం చేయవచ్చు.
కానీ ఈసారి అటువంటి చిట్కాలతో ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను సంతృప్తి పరిచి, సమస్యను దాట వేయడం కష్టమే కావచ్చు. ఎందుకంటే, వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి ఆకర్షించే ప్రయత్నాలు సాగుతున్నంత వరకు, జగన్ కూడా తన పార్టీని కాపాడుకోవడానికి తెదేపాను ధీటుగా ఎదుర్కొంటూనే ఉంటారు. అందుకు ఈ ప్రత్యేక హోదాకి మించిన బ్రహ్మాస్త్రం మరొకటి లేదు. కనుక దానినే ఆయన మళ్ళీ మళ్ళీ తెదేపాపై ప్రయోగించక మానరు. కనుక ప్రతీసారిలాగే ఈసారి కూడా కేంద్రం ఏదో కొన్ని నిధులు విడుదల చేసినప్పటికీ, ప్రత్యేక హోదాపై తెదేపాను జగన్మోహన్ రెడ్డి నిలదీయకుండా వదిలిపెట్టరు.మరి ఈ సమస్య నుంచి తెదేపా ఏవిధంగా బయటపడుతుందో చూడాలి.