తెలంగాణా ప్రభుత్వానికి ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడని జగన్మోహన్ రెడ్డి, మొట్టమొదటిసారిగా ఆ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు తదితర ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు. అందుకోసం మే 16 నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. దాని వెనుక ఆయన రాజకీయ ఉద్దేశ్యాలు…వాటి తక్షణ ఫలితాలు అన్నీ కళ్ళకి కట్టినట్లు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి చూస్తే, జగన్ దీక్ష ప్రకటన తరువాతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా కదలిక రావడం అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రితో సహా అందరూ తెలంగాణా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి, మా హక్కులను కాపాడుకొంటామని హెచ్చరించారు. కేంద్రానికి లేఖలు వ్రాసి పడేశారు. అందుకు అవతల వైపు నుంచి పులులు, సింహాలు నిద్ర లేచి గర్జించడం మొదలుపెట్టాయి. పంచాయితీలకయినా రాళ్ల యుద్ధాలకయినా రెడీ అని డిక్లేర్ చేసేసారు అవతలివాళ్ళు.
తెలంగాణా ప్రభుత్వం పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టులను ఎవరికీ తెలియకుండా, కనబడకుండా రహస్యంగా నిర్మించడం లేదు. వాటికి అనుమతులున్నాయా లేదా అనేది వేరే సంగతి. ఆ ప్రాజెక్టులను ఏవిధంగా, ఎక్కడ, ఎంత డబ్బుతో ఖర్చు చేసి నిర్మించబోతున్నామో, వాటి వలన తెలంగాణాలో ఏ ఏ ప్రాంతాలకు నీళ్ళు పారించదలచుకొన్నామో శాసనసభలో పిక్చరు వేసి మరీ వివరించారు కేసీఆర్. శాసనసభలో అలాగ సినిమా వేసి చూపించడం చూపించడం కరక్టా కాదా అనే అందరూ అప్పుడు వాదించుకొన్నారు తప్ప ఆ ప్రాజెక్టుల నిర్మించవచ్చా..కూడదా? నిర్మిస్తే దిగువనున్న ఆంధ్రాకి నష్టం కలుగుతుందా లేదా? కలిగితే తక్షణ కర్తవ్యం ఏమిటి? అని ఆలోచించలేదు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తను చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి అంత వివరంగా చెప్పిన తరువాత కూడా జగన్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఎందుకు స్పందించలేదో తెలియదు. కానీ హటాత్తుగా జగన్ దీక్షకు కూర్చొంటానని ప్రకటన చేశారు. ఆ వెంటనే చంద్రబాబు కూడా స్పందించి నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రకటించేశారు. తీవ్రమయిన ఈ సమస్య పట్ల వారి ఆలోచనలు, రాజకీయాలు, ప్రతిస్పందనలు చూస్తే వారిద్దరికీ నిజంగానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనే ఆసక్తి, నిబద్దత ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.