తుని విద్వంసానికి కారకులైనవారిని విడిచిపెట్టాలని కోరుతూ కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షకి దిగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. “తుని ఘటనలు అందరికీ తలవంపులు తెచ్చాయి. ఉద్యమాల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు పోలీస్ స్టేషన్లను, రైళ్ళను, ప్రభుత్వ వాహనాలను తగులబెడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? ఉద్యమాల పేరుతో ప్రజలను భయబ్రాంతులను చేస్తుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవాలా? అప్పుడు ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతారు? అటువంటి సంఘ విద్రోహక శక్తులపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటుంటే, దానిని నిరసిస్తూ ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షలు చేయడం సమంజసమేనా?” అని ప్రశ్నించారు.
“కాపుల కోసం ఏమీ చేయని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని దేవుడయ్యాడు. వారి కోసం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి, వారి సంక్షేమం కోసం కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి వందల కోట్లు ఇస్తున్న నేను విరోధిని అయ్యాను. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇకనైనా ముద్రగడ ఎవరి మాటలో వింటూ రాజకీయాలు చేయడం మాని కాపుల సంక్షేమం కోసం ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుంది,” అని ముఖ్యమంత్రి అన్నారు.
“రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. కనుక కొత్తగా సమస్యలు సృష్టించవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవలసిన ఈ సమయంలో కొందరు తమ స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రంలో అశాంతి, శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. అయినా ప్రభుత్వం చాలా ఓర్పుగా అందరి సమస్యలను పరిష్కరించుకొంటూ ముందుకు వెళుతోంది. కనుక ముద్రగడ పద్మనాభంతో సహా అందరూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా సహనాన్ని అసమర్ధతగా భావించి ఎవరైనా రాష్ట్రంలో అశాంతి, అరాచకం సృష్టించే ప్రయత్నాలు చేస్తే వారి పట్ల కటినంగా వ్యవహరిస్తాము,” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
మంత్రులు అడిగిన ప్రశ్నలకే సమాధానాలు చెప్పలేకపోతున్న ముద్రగడ పద్మనాభం, ముఖ్యమంత్రి అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. ఒకవేళ ఆయన ‘అవును అటువంటి సంఘటనలను, విద్రోహ శక్తులను ప్రభుత్వం ఉపేక్షించవలసిందే,’ అని స్పష్టంగా చెప్పగలిగితే దానిని బట్టి ప్రభుత్వం కూడా ముందుకు వెళుతుంది. అలాగ కాక ‘నేను నా జాతి కోసమే పోరాడుతున్నాను. అరెస్ట్ చేసినవారిని విడుదల చేసేవరకు దీక్ష విరమించనని’ ఆయన స్పష్టం చేస్తే ఆయనకి అండగా నిలవాలో వద్దో కాపు ప్రజలే నిర్ణయించుకొంటారు.