మొన్న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నదీ జలాల పంపకాల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూర్చొని మాట్లాడుకొని అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి సిద్దంగా
ఉన్నానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఆ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు అటువంటి ప్రతిపాదన చేస్తుంటారు. దానికి కేసీఆర్ ‘నో’ చెప్పడమో లేకపోతే అసలు పట్టించుకోకపోవడమో చేసేవారు. కానీ ఈసారి కేసీఆర్ ‘చర్చించుకొందాం’ అంటే చంద్రబాబు నాయుడు ‘నో’ చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. “తెలంగాణా ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లుగా ప్రాజెక్టులు నిర్మించుచేసుకొంటున్నప్పుడు దానితో చర్చలకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పాత, కొత్త ప్రాజెక్టులన్నిటిపై ఎపెక్స్ కౌన్సిల్, సి.డబ్ల్యూ.సి సమక్షంలోనే చర్చించుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రాల మధ్య ఇటువంటి
సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికే వాటిని ఏర్పాటు చేశారని కనుక వాటి సమక్షంలోనే చర్చలు జరగాలని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతీసారి తానే చొరవ తీసుకొని సమస్యలను సర్దుబాటు చేస్తున్నానని కానీ ఇకపై ఎపెక్స్ కౌన్సిల్, సి.డబ్ల్యూ.సి సమక్షంలోనే చర్చలకు కూర్చొంటామని తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అందులో భాగంగా డిండి ఎత్తిపోతల పధకాలను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో నిరాహార దీక్షలు చేశారు. ఆ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు ఓటుకి నోటు కేసుకి భయపడే ఆ ప్రాజెక్టులని అడ్డుకొనే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ కి దాసోహం అంటూ రాష్ట్ర ప్రయోజనాలాన తెలంగాణాకి
తాకట్టు పెడుతున్నారని జగన్ విమర్శించారు. బహుశః అందుకే చంద్రబాబు నాయుడు తన సహజశైలికి భిన్నంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి కొంచెం కటువుగా జవాబిచ్చినట్లున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మద్య ఎటువంటి రాజకీయ విద్వేషాలున్నప్పటికీ వాటి వలన ప్రజలు నష్టపోకుండా ఉండాలి. తెలంగాణా ప్రాజెక్టుల వలన ఆ రాష్ట్రం సస్యశ్యామలం అవ్వాలి. రైతుల కష్టాలు కన్నీళ్ళు కరిగిపోవాలి. కానీ అదే సమయంలో ఆంధ్రాలో రైతన్నల కంట కన్నీళ్లు
చిలికే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకొంటే మంచిది.