ఓ రెండు మూడు రోజులపాటు ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గట్టిగానే మాట్లాడారు. ఇవ్వాళ్ళ ఆయన మాటలు వింటే కొంచెం మెత్తబడినట్లు అర్ధమవుతుంది.
విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “రెండు రోజుల క్రితమే నేను ప్రధాని నరేంద్ర మోడీతో దీని గురించి మాట్లాడాను. మళ్ళీ ఈరోజు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో కూడా మాట్లాడాను. రాజధాని నిర్మాణానికి సహాయం చేయాలని కోరాను. రాష్ట్ర పరిస్థితులు అన్నీ ఆయనకి మరోమారు వివరించి, రాష్ట్రానికి ఏమి ఇవ్వాలనుకొంటున్నారో స్పష్టం చేయమని కోరాను. దానిని బట్టి మా ప్రభుత్వం ప్రణాళికలు రచించుకొంటుందని తెలిపాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు,” అని అన్నారు.
మూడు రోజుల క్రితం ఆయన మాటలలో ఉన్న తీవ్రత ఇప్పుడు కనబడకపోవడం గమనిస్తే, చంద్రబాబు నాయుడు మెల్లిగా వెనక్కి తగ్గుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఈలోగా కేంద్రం కూడా మళ్ళీ ఎంతో కొంత నిధులు విదిలించవచ్చు. అప్పుడు “కేంద్రం రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకోవాలి…అదుకొంటుందని ఆశిస్తున్నాము… భాజపాతో మా సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయి.. అలాగే కొనసాగుతాయి…మేము విడిపోవాలనే జగన్ ఆశ ఎన్నటికీ నెరవేరదు,” వంటి రొటీన్ డైలాగులన్నిటినీ వినే భాగ్యం ప్రజలకి కలుగుతుంది. ఇంకా అవసరమనుకొంటే ఓసారి డిల్లీ వెళ్లి ప్రధానిని, ఆర్ధికమంత్రి, హోం మంత్రిని కలిసి రావచ్చును. ఒకవేళ అప్పటికీ రాష్ట్రంలో ఇంకా వేడి తగ్గకపోతే ప్రజల ‘ఇగో’ని సంతృప్తి పరిచేందుకు ఆయన వెనక్కి తగ్గి మంత్రుల చేత కేంద్రంపై విమర్శలు చేయించుతూ క్రమంగా ఆ వేడిని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఈ షోని రక్తి కట్టించేందుకు రాష్ట్ర భాజపా నేతలు కూడా ఎంట్రీ ఇచ్చి తెదేపాపై బాణాలు సందించవచ్చు. ఈలోగా ఓ నలుగురు వైకాపా ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపజేస్తే అందరి దృష్టి మళ్ళీ దాని మీదకు మళ్ళుతుంది. అక్కడితో ప్రత్యేక హోదా ఎపిసోడ్ లో మరో అధ్యాయం ముగిసినట్లే భావించవచ్చు. తరువాత ఎపిసోడ్ మళ్ళీ ఎప్పుడో ఎవరో కెలికి వదిలిపెట్టినప్పుడు మొదలవవచ్చు. అప్పుడూ మళ్ళీ అంతా సేమ్ టు సేమ్.