ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రతిపక్షాలు రామనామ స్మరణలాగ స్మరిస్తుంటే, అధికార తెదేపా నేతలు దానిని బూతు పదం అన్నట్లుగా భావిస్తూ తమ ప్రసంగాలలో ఎక్కడా ఆ పదం వాడకుండా జాగ్రత్తగా ముగించేస్తుంటారు. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో అందరూ గలగలా మాట్లాడేస్తున్నారు. దాని గురించి ఎన్నడూ మాట్లాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ఆ పదాన్ని కొంచెం గట్టిగా ఒత్తి మాట్లాడటం విశేషం. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని డిల్లీ సర్కార్ చెప్పినప్పుడల్లా రాష్ట్రంలో హడావుడి మొదలవడం అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా దాని గురించి ప్రధాన మంత్రిని గట్టిగా అడుగుతానని చెప్పడం అంతా రొటీన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. శనివారం విశాఖపట్నంలో జరిగిన నీరు-ప్రగతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ “ప్రత్యేక హోదా, రైల్వే రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు భర్తీకి ఆర్ధిక ప్యాకేజితో సహా విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నిటినీ అమలుచేయమని కేంద్ర ప్రభుత్వాన్ని రెండేళ్లుగా కోరుతూనే ఉన్నాము. రెవెన్యూ లోటు భర్తీ చేయమని కూడా అడుగుతూనే ఉన్నాము. మా ప్రయత్నలోపం ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చాలా ప్రాజెక్టులు, వాటి కోసం నిధులు విడుదల చేస్తున్నమాట నిజమే కానీ అంత మాత్రాన్న ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర మంత్రి చెప్పడం సరికాదు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తో సహా అన్ని హామీలను అమలుచేయమని నేను ప్రధాని నరేంద్ర మోడీకి త్వరలో లేఖ వ్రాయబోతున్నాను,” అని చెప్పారు.
ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడటం రొటీన్ తంతే అయినా, తెదేపా-భాజపాల సంబంధాలు క్రమంగా దెబ్బ తింటున్న నేపధ్యంలో ఆయన ఈవిధంగా మాట్లాడటం, భాజపాకి, మోడీ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలుగానే చూడవలసి ఉంటుంది. ఒకవేళ తెదేపాతో భాజపా తెగతెంపులు చేసుకొన్నట్లయితే, ఈ అంశాలపై తమ పార్టీ స్పందన ఏవిధంగా ఉంటుందో రుచి చూపిస్తునట్లుగా భావించవచ్చు.