ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు తెదేపా ఎంపిలతో అత్యవసరం సమావేశం కాబోతున్నారు. ఈ విషయం ఎంపి మురళీ మోహన్ తెలిపారు. రేపటి సమావేశంలో పార్లమెంటు సమావేశాలలో ఏవిధంగా వ్యవహరించాలి? ఇకపై కేంద్రప్రభుత్వంతో ఏవిధంగా వ్యవహరించాలి? అనే విషయాలపై చర్చిస్తామని తెలిపారు. ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రయోజనాల కంటే కేంద్రమంత్రి, ఎంపి పదవులు మాకు ముఖ్యం కాదు. అవసరమైతే వెంటనే రాజీనామా చేసేస్తాము. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదో, దానిని విభజన చట్టంలో పెట్టేందుకు పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ఇస్తామని ముందుకు వస్తామని చెపుతున్నా మోడీ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందో అర్ధం కాదు. ప్రత్యేక హోదా అంశాన్ని 14వ ఆర్ధిక సంఘంతో ముడిపెట్టి తప్పించుకొనే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. డిల్లీలో మా పరిస్థితి చాలా అయోమయంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల కోసమే ఎదురుచూస్తున్నాము. రేపు ఆయన సూచనలు, సలహాలు తీసుకొని తదనుగుణంగా వ్యవహరిస్తాము,” అని చెప్పారు.
మరో తెదేపా ఎంపి కేశినేని నాని కూడా ఇంచుమించు అదేవిధంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రెండు కేంద్రమంత్రి పదవుల కోసం మేమేమి కక్కుర్తి పడటంలేదు. ఆ అవసరం కూడా మాకు లేదు. వాటి వలన రాష్ట్రానికి ఏదో ఒక మేలు కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే అవి తీసుకొన్నాము తప్ప పదవులు, అధికారం కోసం ఆశపడి కాదు. రెండు మంత్రి పదవులు పోయినంత మాత్రాన్న ఏమీ నష్టం లేదు. ప్రత్యేక హోదా కోసం అన్నిటినీ వదులుకోవడానికి సిద్దంగా ఉన్నాము. వైకాపా ఒక కుమ్మకు పార్టీ. దాని అధినేత జగన్మోహన్ రెడ్డి ఏవేవో మాట్లాడుతుంటారు. ఆయన మాటలని పట్టించుకోనవసరం లేదు. ప్రత్యేక హోదా అంశంపై ఏవిధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ప్రజలు, మేధావులు, పార్టీ నేతలు అందరినీ సంప్రదించి ముందుకు వెళ్తాము,” అని అన్నారు.
వారిరువురి మాటలు వింటే, రేపోమాపో అందరూ రాజీనామాలు చేసి వచ్చేసి, భాజపాతో తెగతెంపులు చేసేసుకో బోతున్నట్లు అనిపిస్తుంది. కానీ గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వారు ఇదే విధంగా చెప్పారు కనుక అటువంటి తొందరపాటు నిర్ణయాలు ఏవీ తీసుకోకపోవచ్చు. మహా అయితే పార్లమెంటులో మరికాస్త గొంతు పెంచి మాట్లాడవచ్చు. అంతే!
కేంద్రప్రభుత్వం పార్లమెంటులో మళ్ళీ జి.ఎస్.టి.బిల్లు ప్రవేశపెడితే అప్పుడు ఇక ప్రధానంగా దానిపైనే చర్చ సాగుతుంది. ఈలోగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు వేరే అంశాలు పట్టుకొని సభలో రభస చేయకమానవు. ఆ గొడవలో తెదేపా ఎంపిల గొంతు వినబడే అవకాశమే ఉండకపోవచ్చు. కనుక ప్రత్యేక హోదా విషయంలో ఇక పార్లమెంటులో కొత్తగా జరిగేది, ఒరిగేదీ ఏమీ ఉండకపోవచ్చు.