ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పర్యటించబోతున్నారు. ఒక్కో జిల్లాకు అవసరాన్ని బట్టి 2-3 రోజులు చొప్పున పర్యటించాలని నిర్ణయించుకొన్నారు. అంటే ఆయన సుమారు నెలన్నర రోజులు జిల్లాలలో పర్యటించబోతున్నారని భావించవచ్చును. ఆయన పర్యటన ప్రధానోద్దేశ్యం జిల్లాలలో సమస్యల పరిష్కారం చేయడం, జిల్లాలలో సాగుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులను సమీక్షించి అధికారులకు అవసరమయిన సలహాలు, సూచనలు చేస్తారని సమాచారం.
ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఏదో ఒక జిల్లా పర్యటన చేయడమే తప్ప ఈవిధంగా ఒకేసారి వరుసగా అన్ని జిల్లాల పర్యటనలు చేసి చాలా కాలమే అయ్యింది. గత ఏడాది ఆయన అధికారం చేపట్టిన కొత్తలో ఓసారి అన్ని జిల్లాలు పర్యటించారు. అప్పుడు పూర్తిగా వేరే కారణంతో పర్యటించారు. రాష్ట్రానికి అవతల ఉన్న హైదరాబాద్ నుంచి ఆయన అప్పుడు పరిపాలన కొనసాగిస్తున్నందున, ప్రజలకి-ప్రభుత్వానికి మధ్య దూరం ఏర్పడిందనే భావన అందరిలో చాలా బలంగా ఉండేది. దానిని తొలగించేందుకే అప్పుడు ఆయన జిల్లాల పర్యటన కార్యక్రమం పెట్టుకొన్నారు. కానీ ఇప్పుడు ఆయన విజయవాడ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. పైగా ఈ 23 నెలల్లో అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొని నిలిచి ఆయన ప్రభుత్వం బాగా స్థిరపడింది. కనుక ఈసారి ఆయన జిల్లాల పర్యటనలలో ప్రజా సమస్యల పరిష్కారం, వివిధ పనులను సమీక్షించడంతో బాటు, వైకాపా నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తెదేపాలో చేర్చుకోవడం కూడా ఆయన పర్యటన ఉద్దేశ్యం కావచ్చును.
ఈ జూన్ నెలలో రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం వాటిలో మూడు తెదేపాకి ఒకటి వైకాపాకి దక్కుతాయి. ఆ ఒక్క సీటుని కూడా వైకాపాకి దక్కనీయకుండా చేస్తామని తెదేపా చెప్పుకొంది. ఆ ప్రయత్నంలో భాగంగానే వైకాపాకి చెందిన 10మంది ఎమ్మెల్యేలని తెదేపాలోకి ఆకర్షించింది. ఇంకా మరో 20-25 మంది ఎమ్మెల్యేలని తెదేపాలోకి రప్పించగలిగినప్పుడే అది సాధ్యం అవుతుంది. తెదేపాలో చేరాలనుకొంటున్న వైకాపా ఎమ్మెల్యేలు, నేతలను తెదేపా నేతలు ప్రోత్సహించి ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జిల్లాలకు వచ్చినప్పుడు వారిని పార్టీలో చేర్పించే అవకాశం ఉందని భావించవచ్చును. అదే కనుక జరిగినట్లయితే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన స్వామి కార్యంతో బాటు స్వకార్యం కూడా పూర్తి చేసుకొన్నట్లే భావించవచ్చును.