ఇంతకాలం మోడీ భజనలో చంద్రబాబు నాయుడు, బాబుగారి భజనలో వెంకయ్య నాయుడు తరించిపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో తెదేపాతో తెగతెంపులు చేసుకోబోతున్నట్లుగా భాజపా నేతలు స్పష్టమయిన సంకేతాలు ఇస్తుండటంతో, తెదేపా నేతలు కూడా అందుకు అనుగుణంగానే స్పందించడం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ తదితర హామీలను అమలుచేయమని కేంద్రప్రభుత్వం చంద్రబాబు నాయుడు గట్టిగా ఒత్తిడి చేయడం లేదని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిందిస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు ఏనాడూ ఆ విమర్శలకు జవాబివ్వలేదు. కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేదు. కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటూనే రాష్ట్రానికి ఇచ్చిన హామీలనన్నిటినీ అమలుచేసేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని తన పార్టీ నేతలకి, ఎంపిలకి చెపుతుండేవారు. కానీ మొట్టమొదటిసారిగా అయన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల విభజన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శి సంజయ్ కొటారి నిన్న ఆ పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు, విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయినప్పుడు కేంద్రప్రభుత్వం వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.
“రెండేళ్ళు పూర్తికావస్తున్నా ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, రాజధాని నిర్మాణానికి అవసరమయిన నిధులను కూడా మంజూరు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిపినప్పుడు, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదయినా గట్టిగా అడిగితేనే ఇద్దామనే ధోరణిలో కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోంది. నేనే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, తదితర కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. మా అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్ర మోడికి మీరే చెప్పి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడండి,” అని చంద్రబాబు నాయుడు కోరినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక హోదా, తదితర హామీల అమలు కోసం రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇంతకాలం ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోని చంద్రబాబు నాయుడు హటాత్తుగా ఇంత కటువుగా ఎందుకు మాట్లాడారంటే తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలని భాజపా సంకేతాలు పంపుతుండటం వలననే అని భావించవచ్చును. తెదేపాతో భాజపా తెగతెంపులు చేసుకొంటే, ప్రత్యేక హోదా గురించి తెదేపా నేతలు గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టవచ్చని ముందే చెప్పుకొన్నాము. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రత్యేక హోదా అనేది ఇంతకాలం ప్రతిపక్షాలకు ఒక బ్రహ్మాస్త్రంగా వాడుకొన్నాయి. బహుశః ఇప్పుడు దానిని తెదేపా వాడుకోవచ్చును.
ఎన్నికలకి ఇంకా మూడేళ్ళ సమయం మిగిలి ఉన్నప్పుడు అప్పుడే తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలనుకోవడం చాలా తొందరపాటే అవుతుంది. దాని వలన తెదేపా కంటే భాజపాయే ఎక్కువ నష్టపోయే అవకాశాలున్నాయి. ఈ రెండు పార్టీలు కలహాలవలన రాష్ట్రం కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే రాష్ట్ర ప్రజలు ఆ రెండు పార్టీలకి కూడా తగిన గుణపాఠం చెప్పకమానరు. కనుక అటువంటి పరిస్థితి చేజేతులా తెచ్చుకొనేబదులు, రెండు పార్టీలు కలిసి రాష్ట్రాభివృద్ధికి గట్టిగా కృషి చేస్తే అందరికీ మేలు జరుగుతుంది కదా.