ఉద్యోగుల బదిలీల విషయంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, చిన రాజప్పల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడం తెదేపా ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగించే విషయమే. మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వచ్చిన ఆ వార్తలు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్లయింది.
మంత్రులు ఆవిధంగా వ్యవహరించడానికి, వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడానికి చాలా కారణాలు కనబడుతున్నాయి.
ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా జరగాలని, అంతా నిబంధనల ప్రకారమే జరగాలని, అవకతవకలు జరిగినట్లు తెలిస్తే సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులందరినీ ముందే హెచ్చరించారు. బహుశః అందుకే వారిద్దరూ బదిలీల వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ల చేతిలో పెట్టి వాటికి దూరంగా ఉన్నారనుకోవచ్చు. మళ్ళీ ముఖ్యమంత్రే మరోమాట కూడా చెప్పారు. మంత్రులు, కలెక్టర్లు తమకి అనుగుణంగా పనిచేసే ఉద్యోగులతో టీమ్ ని ఏర్పాటు చేసుకోమని చెప్పారు. అంటే తమకు నచ్చిన ఉద్యోగులని తమ జిల్లాలకి బదిలీ చేసుకోవచ్చని చెప్పినట్లే భావించవచ్చు. బదిలీల విషయంలో పారదర్శకంగా ఉండాలని చెపుతూనే, మళ్ళీ ఈవిధంగా చెప్పడం గందరగోళానికి దారి తీసినట్లు కనిపిస్తోంది.
ఒక్క ఉద్యోగుల బదిలీ విషయంలోనే కాదు, హైదరాబాద్ నుంచి అమరావతికి ఉద్యోగుల తరలింపు, తాత్కాలిక సచివాలయం, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం వంటి అన్ని వ్యవహారాలలో ముఖ్యమంత్రి నిర్దిష్ట గడువు విదించుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఏవో కారణాల చేత ఆ పనులు సకాలంలో పూర్తికానప్పుడు ఆయన ఈవిధంగా అసహనం వ్యక్తం చేస్తుండటం జరుగుతోంది. ఈనెల 27 నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన సాగించాలనుకొన్నప్పటికీ అది సాధ్యం కాదనే సంగతి స్పష్టం అవడం ముఖ్యమంత్రి అసహనానికి ఒక కారణం అయ్యుండవచ్చు.
ప్రతీ పనిని తనే స్వయంగా చూసుకోవలసి వస్తోందని ముఖ్యమంత్రి అనడం గమనిస్తే ఆ శాఖలకి చెందిన మంత్రులు, అధికారులు చొరవ తీసుకొని ఆ పనులని సకాలంలో పూర్తి చేయడం లేదనే భావన ఆయన మాటలలో కనిపిస్తోంది. ఆ కారణంగా ముఖ్యమంత్రిపై పని ఒత్తిడి పెరిగిపోవడం కూడా ఆయన అసహనానికి ఒక కారణం అయ్యుండవచ్చు.
మంత్రులు, అధికారుల పనితీరుపై తనే సంతృప్తి చెందలేకపోతున్నప్పుడు, ప్రజలు కూడా తన ప్రభుత్వంపై సంతృప్తిగా ఉండే అవకాశం లేదని ముఖ్యమంత్రి గ్రహించినట్లే ఉన్నారు. బహుశః అందుకే ఆ అసంతృప్తి, అసహనం ఆయన మాటలలో వ్యక్తం అయినట్లుంది.
అయితే ఈ వ్యవహారంలో ఆ ఇద్దరు మంత్రులపైనే ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడానికి వేరే కారణం ఉండి ఉండవచ్చనిపిస్తోంది. బహుశః సాక్షి మీడియాపై నిషేధం విదించడం గురించి వారిరువురూ మాట్లాడిన మాటల వలన ప్రభుత్వానికి హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొనే పరిస్థితి కలిగినందుకే వారిపై ఈ కారణంతో ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారేమో?
కారణాలు ఏవయినప్పటికీ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో మంత్రులు వేలు పెట్టడం అవసరమా లేకపోతే ఆ బాధ్యతని ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులకి, కలెక్టర్లకి విడిచిపెట్టడం మంచిదా? అనే చర్చకి ఇది అవకాశం కల్పించింది.