మరో 45 రోజులలో కృష్ణా పుష్కరాలు మొదలవుతాయి. వాటిని గోదావరి పుష్కరాల కంటే చాలా గొప్పగా నిర్వహించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకోసం బారీగా నిధులు కేటాయించి ఆరు నెలల క్రితం నుంచే పుష్కరపనులను మొదలుపెట్టించారు. వీలున్నప్పుడల్లా ఆయనే స్వయంగా ఆ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. నిన్న ఆకస్మిక తనికీలు చేసిన ముఖ్యమంత్రి పుష్కర పనులు జరుగుతున్న తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్ళీ జూలై 1న వస్తానని అప్పటికీ పనులలో పురోగతి కనిపించక పోతే కాంట్రాక్టర్ల పట్ల కటినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి హెచ్చరికలతో పనులు వేగం పుంజుకోవచ్చు. అది సహజమే! అయితే వారి చేత పనులు చేయించే బాధ్యత ముఖ్యమంత్రే తీసుకోవాలా? సంబంధిత శాఖల మంత్రులు, అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజా ప్రతినిధులు ఇంతమంది ఉండగా ముఖ్యమంత్రి పూనుకోవలసిన అవసరం ఏముంది? గోదావరి పుష్కరాలలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నీ తానై పనులు జరిపించి చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేసి అందరి మన్ననలు పొందారు. కానీ రాజమండ్రిలో జరిగిన త్రొక్కిసలాటలో 32మంది చనిపోయినప్పుడు, ఆయన సంపాదించుకొన్న మంచిపేరు కాస్తా గోదావరిలో కలిసిపోయింది. అందరూ ఆయననే వేలెత్తి చూపించారు. గోదావరి పుష్కరాలు చాలా అట్టహాసంగా, అద్భుతంగా నిర్వహించినా త్రొక్కిసలాటలో 32మంది భక్తులు చనిపోయిన సంఘటనే ఎక్కువగా హైలైట్ అయ్యింది. పుష్కరాలు ఘనంగా నిర్వహించిన క్రెడిట్ తో బాటు ఆ విషాద సంఘటనకి బాధ్యతని కూడా ముఖ్యమంత్రే స్వీకరించాల్సి వచ్చింది.
అది స్వయంకృతాపరాధమే. తన క్రింద అనేకమంది మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నప్పుడు, వారికే పూర్తి బాధ్యతలు అప్పగించి వారి ద్వారానే పుష్కరాలు నిర్వహించి ఉంటే, మంచైనా చెడైన అందరికీ సమాన బాధ్యత వహించాల్సి వచ్చేది. కానీ ప్రచారయావతోనో లేదా తన మేనేజ్ మెంట్ సమార్ధ్యాన్ని నిరూపించి అందరి మెప్పు పొందాలనే తపనతోనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పుష్కరలతో వేరెవరికీ సంబంధం లేదన్నట్లు అంతా తానై నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుని కూడా పక్కనబెట్టడంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ఈసారి కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యత సంబంధిత మంత్రులు, అధికారులకి అప్పగించి ముఖ్యమంత్రిపై నుంచి పర్యవేక్షిస్తే సరిపోయేది కానీ ఈసారి కూడా అన్నీ తానై నడిపించాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది మంచిదేనా కాదా అని ఆలోచించుకొంటే బాగుంటుంది.