ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు అంశాలలో తరచూ ప్రతిపక్షాలకు, మీడియాకి దొరికిపోయి ఇబ్బందిపడుతున్నాయి. 1 ప్రత్యేక హోదా. 2 ఆర్ధిక ప్యాకేజ్. 3 రైల్వే జోన్. 4 పోలవరం ప్రాజెక్టు. వీటిలో పోలవరాన్ని మెల్లగా ముందుకు నడిపించుకొని వెళుతున్నా మిగిలిన మూడు హామీలపై కేంద్రం మాట తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం వాటి గురించి మాట్లాడదు. అందుకే అవి ప్రతిపక్షాల ముందు తల దించుకోవలసి వస్తోంది. రెండూ కలిసి రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాయని ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఈరోజు కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు విలేఖరులు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించినపుడు ఆయన సమాధానం చెప్పడానికి కొంచెం ఇబ్బందిపడ్డారు.
ప్రత్యేక హోదా గురించి విలేఖరులు అడిగితే ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. వచ్చే ఎన్నికలలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని మరోమారు ఉద్ఘాటించారు తప్ప ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నిటినీ అమలుచేసే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టనని అన్నారు. ఆయన మెత్తగా అడిగినా గట్టిగా అడిగినా ఇప్పుడు కేంద్రం ఆయనను బొత్తిగా పట్టించుకోవడం లేదని కనబడుతూనే ఉంది. ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయాయి. అలాగే రెండేళ్ళు పూర్తి కావస్తున్నా పోలవరం పూర్తి చేస్తామని చెప్పడమే తప్ప పనులు సాగడం లేదు. అయినా హామీలు అమలయ్యే వరకు కేంద్రాన్ని విడిచిపెట్టను అని ఆయన చెప్పడం ప్రజలను మభ్యపెట్టడానికేనని చెప్పవచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో కూడా భాజపా తెదేపాతో కలిసి పోటీ చేయాలనుకొంటే, ఎన్నికలకు ముందు ఆయన మాట ఆలకించవచ్చు లేదంటే ఇంకా హామీల అమలు గురించి ఆయన ప్రధాని నరేంద్ర మోడిని ఎంతగా ప్రాధేయపడినా ప్రయోజనం ఉండబోదు.