మాట్లాడితే తాను పేదల ప్రతినిధినని.. ఏపీలో పేదలకు.. పెత్తందారులకు మధ్య పోటీ జరుగుతుందని కళ్లార్పకుండా ప్రసంగిస్తూ.. పేదలందరికీ తానే పెత్తందారునన్నట్లుగా వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి… దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో కల్లా అత్యంత ధనవంతుడు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో తేలింది. వీరి లెక్క ప్రకారం AP సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత సంపన్నుడు. ఆయన ఆస్తుల విలువ రూ.510 కోట్లని నివేదిక తెలిపింది.
ఆస్తుల విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిట్టచివరన ఉన్నారు. ఆమె పేరిట కేవలం 15 లక్షల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్- నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు తెలిపాయి. దేశంలోని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల ఆస్తుల విశ్లేషణ. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు ప్రస్తుతం ముఖ్యమంత్రి లేరు కాబట్టి ఆ వివరాలు వెల్లడించలేదు. 30 మంది ముఖ్యమంత్రుల్లో 97 శాతం అంటే 29 మంది కోటీశ్వరులు. ఒక్కో సీఎం సగటు ఆస్తి రూ.33.96కోట్లు.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తి రూ.510కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఆస్తి రూ.163 కోట్లు , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తి రూ.63 కోట్లు .ఈ ముగ్గురు అత్యంత ఎక్కువ ఆస్తి కలిగిన ముఖ్యమంత్రులు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తి రూ.15 లక్షలు , కేరళ సీఎం పినరయి విజయన్ ఆస్తి రూ.కోటి హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆస్తి రూ.కోటి ఉన్నాయి. వీళ్లు తక్కువ ఆస్తి కలిగిన ముగ్గురు ముఖ్యమంత్రులు
ఈ 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మందిపై తీవ్రమైన నేరాలు, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, బెదిరింపులు లాంటి కేసులు ఉన్నాయి. వీటిలోనూ సహజంగా జగనే నెంబర్ వన్. ఇవన్నీ బెయిల్‌కు వీల్లేని ఐదేళ్లకన్నా ఎక్కువ శిక్ష పడే కేసులేనని నివేదిక తెలిపింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించినట్లుగా జగన్ ఏటా జమ చేసే ఐటీ రిపోర్టుల ఆదారంగా అర్థమైపోతుంది. అయినా వ్యవస్థలేమీ చేయలేకపోవడం వల్ల ఆయనే సీఎం అయి వ్యవస్థల్ని నడిపించేస్తున్నారు.