ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ ను మరో పదేళ్ల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులు చూసి .. ఆయా వర్గాలకు మూర్చ వచ్చినంత పనైంది. ఎందుకంటే గత నాలుగేళ్లుగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అనే మాటే ఎక్కడా వినిపించడం లేదు. కానీ పేపర్లలో మాత్రం నిధుల కేటాయింపు కనిపిస్తోంది. ఆ వర్గాలు ఆర్థికంగా పైకి వచ్చేందుకు పైసా సాయం చేయడం లేదు. కానీ వేల కోట్లలో కేటాయింపులు చూపిస్తున్నారు. అంటే.. ఇలా పేపర్లపై కేటాయించి అలా… దారి మళ్లిస్తున్నారన్నమాట.
ఏపీ.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అంటే ?
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి, సంక్షేమానికి బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం ఈ సబ్ ప్లాన్ లక్ష్యం. వీటిలో 40 శాతం మూలధన నిధులు ఎస్సీ, ఎస్టీల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించాలి. 2013 మే నెలలో ఏపీ శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు సంబంధించిన చట్టం చేశారు. అంతకు ముందు ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వాలు నిధులు కేటాయించినప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించేవారు కాదు. ఇతరత్రా అవసరాలకు ఎస్సీ,ఎస్టీ నిధులు మళ్లించేవారు. ఆ పరిస్థితి రాకుండా చట్టం చేశారు ప్రతి బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీల కోసం నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎస్సీల జనాభా పరంగా 16.23 శాతం నిధుల్ని బడ్జెట్ నుంచి కేటాయించాలి. ఎస్టీల జనాభా పరంగా 6.6 శాతం నిధుల్ని బడ్జెట్ నుంచి కేటాయించాలి.
నిధులన్నీ అందరికీ ఇచ్చే పథకాలే… వారి అభివృద్ధికేమీ చేయలేదు !
వారికి కేటాయించిన నిధుల్ని వారికే ఖర్చు పెట్టడం చట్ట ప్రకారం జరగాలి. నిధులు ఖర్చు పెట్టినట్టు పేపర్ల మీద చూపిస్తున్నారు 2019 నుంచి 2022 వరకు ఏపీ ప్రభుత్వం సబ్ ప్లాన్ కింద రూ. 49,710 కోట్లు ఖర్చు పెట్టినట్టు ప్రకటించింది. కానీ ఇదంతా నవరత్నాల కింద ఈ నిధుల్ని ఖర్చు చేశారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, పెన్షన్లు ఇతర పథకాల కింద ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని ఖర్చు చేశారు. కానీ సబ్ ప్లాన్ అంటే అది కాదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో స్కూల్, కాలేజ్, టాయిలెట్, తాగునీరు, కమ్యూనిటీ హాల్, లైబ్రరీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లోని 40 శాతం నిధుల్ని అందుకు కేటాయించాలి. కానీ సబ్ ప్లాన్ లక్ష్యం ప్రకారం ఏపీ ప్రభుత్వం నిధుల్ని ఖర్చు పెట్టలేదు. దారి మళ్లించి ఇష్టారాజ్యంగా చేసి… ఎస్సీ, ఎస్టీల్ని వంచిస్తోంది.
తెలంగాణలో కొంత మెరుగ్గా అమలు !
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని ఇతర పథకాలతో మమేకం చేయలేదు. నిజం చెప్పాలంటే… దళిత బంధుకు కూడా అదనంగా నిధులు ఇచ్చారు. ఆ ప్రభుత్వం వంద శాతం కాకపోయినా… పథకాలకు సంబంధం లేకుండా నిధులు ఇస్తోంది. కానీ ఏపీలో మాత్రం ఒక్క రూపాయి కూడా పథకాలు తప్ప ఇతర అభివృద్ధి పథకాలకు… ఎస్సీ, ఎస్టీల ఉపాధికి కేటాయించడం లేదు.