ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నీటి విషయంలో తెలంగాణ సర్కార్‌తో అమీతుమీ తేల్చుకోవాలని డిసైడయింది. పోతిరెడ్డిపాడు విస్తరణ కోసం తలపెట్టిన సంగమేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై తెలంగాణ సర్కార్… కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… తెలంగాణ నిర్మిస్తున్న వివాదాస్పద ప్రాజెక్టులన్నింటినీ తెరపైకి తెస్తోంది. కృష్ణాతో పాటు..గోదావరిపై తెలంగాణ సర్కార్ …అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఫిర్యాదు చేశారు. కృష్ణా రివర్ బోర్డు చైర్మన్‌ను నేరుగా కలిసిన ఏపీ బృందం…సంగమేశ్వరం ప్రాజెక్ట్ పై తమ వాదనను వినిపించారు. రాత పూర్వకంగా ఇచ్చారు. గోదావరి రివర్ బోర్డుకు ప్రత్యేకంగా లేఖ రాశారు.
విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ 5 కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ బృందం కేఆర్ఎంబీకి లేఖ ఇచ్చింది. అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ అనుమతి లేకుండానేఈ ప్రాజెక్టులు ప్రారంభిచిందని… కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని గతంలోనే కేంద్రం తెలంగాణను కోరిందని.. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లు సమర్పించలేదని ఆరోపించారు. ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతి ఇచ్చారని స్పష్టం చేశారు. కేటాయించిన వాటాలకు మించి తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగం చేస్తోందని.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై రివర్ బోర్డులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఏపీ అసహనం వ్యక్తం చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ 881 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని..తీసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని.. ఆ స్థాయిలో…ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఏపీ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీరు 800 అడుగుల లెవల్ నుంచి కూడా తీసుకువెళ్లేలా అవకాశం ఉందన్నారు. తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మాదిరిగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నామని ఏపీ అధికారులు వాదిస్తున్నారు.
ఒక్క కృష్ణానదిపై ప్రాజెక్టులనే కాదు.. గోదావరి నదిపై తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై కూడా ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది. విడిగా గోదావరి రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. డీపీఆర్‌లు ఇవ్వకుండా.. అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా… 450 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించడం ప్రారంభించిందని ఏపీ ఆరోపించింది. కింది రాష్ట్రాల ప్రాజెక్టులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉంటుందో చూడకుండా..చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి నీటి కేటాయింపులు ఫైనల్ కాలేదని … కాళేశ్వరం సామర్థ్యం 225 నుంచి 450 టీఎంసీలు.. సీతారామ ప్రాజెక్ట్ సామర్థ్యం 70 నుంచి 100 టీఎంసీలకు పెంచారని ఏపీ ఆరోపించింది. ఆయా ప్రాజెక్టులకు అడ్డుకోవాలని కోరుతున్నామని ఏపీ ప్రభుత్వం లేఖలో కోరింది.