తెలంగాణాలో నిర్మిస్తున్న పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ మొదట ఏపి కాంగ్రెస్ పార్టీయే ఉద్యమం మొదలుపెట్టింది. ఆ తరువాత దానిని జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకొని కర్నూలులో మూడు రోజులు నిరాహార దీక్ష చేసారు. ఆయన పోరాటం ముగించిన తరువాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దానిని అందిపుచ్చుకొని ఉద్యమించడానికి సిద్ధం అవుతోంది.
ఈనెల 23న ప్రకాశం బ్యారేజిపై ధర్నాలు చేస్తామని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు. తెలంగాణాలో నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుల వలన దిగువనున్న ఆంధ్రప్రదేశ్ లో సుమారు 50 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. వాటి వలన 8 జిల్లాలలో ప్రజలకు త్రాగడానికి నీళ్ళులేని పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు. అయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకి నోటు కేసుకి భయపడి కేసీఆర్ ని గట్టిగా నిలదీయడం లేదని విమర్శించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటుకి నోటు కేసుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు.
ఆ ప్రాజెక్టులని అడ్డుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ జగన్ కర్నూలులో మూడు రోజులు దీక్షలు చేసినపుడు ఆయనతో సహా వైకాపా నేతలు అందరూ వాటి వలన రాష్ట్రానికి జరిగే నష్టం కంటే వాటిని అడ్డుకోలేని చంద్రబాబు బలహీనత గురించి చాలా గట్టిగానే మాట్లాడారు. ఆ తరువాత వైకాపా నేతలెవరూ మళ్ళీ ఆ ప్రాజెక్టుల గురించి మాట్లడటం లేదు. వాటిని వ్యతిరేకిస్తూ జగన్ మళ్ళీ తన ఉద్యమం కొనసాగిస్తారో లేదో తెలియదు. ఇప్పుడు రఘువీరా రెడ్డి వాటి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన ఎన్ని రోజులు పోరాడుతారో కూడా తెలియదు. ఈ విధంగా చిత్తశుద్ధి లేని పోరాటాలు చేయడం వలనే ప్రజలు కూడా వారిని విశ్వసించలేకపోతున్నారు. ఆ ప్రాజెక్టుల వలన రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు వాటిపై రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నాయి. అందుకే తెరాస నేతలు కూడా వారి చిత్తశుద్ధిని శంఖిస్తున్నారు.