వెనకటికి ఓ ఇద్దరు రుషులు తపస్సు చేస్తున్నారు. వారిద్దరికీ ఒకరంటే మరొకరికి పడదు. శత్రుత్వం. ఇద్దరికీ కలిపి ఒకేసారి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఒకటో రుషి దగ్గరకు వెళ్లి ఏం కావాలో కోరుకోమన్నాడు. తనేం అడిగినా.. పక్కనే ఉన్నవాడు తనకంటె ఎక్కువ కోరుకుంటాడేమో అని భయపడ్డాడు ఆ రుషి. ఆ రెండో వాడి దగ్గరకు వెళ్లు సామీ.. వాడేం అడిగితే దానికి రెట్టింపు నాకు ఇవ్వు అన్నాడు.
దేవుడు రెండో వాడి దగ్గరకు వెళ్లాడు. వాడు మొదటి రుషి కోరికను అడిగి తెలుసుకున్నాడు. అలాగైతే నాకు ఒక కన్ను, ఒక కాలు, ఒక చేయి పోయేలా వరమివ్వు సామీ అన్నాడు. అంతే మొదటి రుషికి రెండుకళ్లు, రెండు కాళ్లు, రెండు చేతులు పోయాయి.
పరస్పర వైరంతో రగులుతూ ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి.
ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ తీరు కూడా అలాగే కనిపిస్తోంది. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతోంటే.. ఆంధ్రప్రదేశ్ నుంచి అసోం వరకు వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించి వచ్చిన కాంగ్రెస్ నాయకులు.. మొత్తం అయిదు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీకి పతనం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ హవా ఉండదని, భాజపా ఓటమి తప్పదని రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు.
వారి పతనం సరే.. మరి ఈ అయిదు రాష్ట్రాల్లో ఏ ఒక్క చోట అయినా తమ పార్టీకి జనం పట్టాభిషేకం చేస్తారని నమ్మకంగా చెప్పగలరా రఘువీరా గారూ అని జనంలో సందేహాలు రేగుతున్నాయి. ఈ అయిదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల ఈ రెండు జాతీయ పార్టీలూ కనీస ప్రభావం చూపగల స్థితిలో లేవు. ప్రాంతీయ పార్టీల, వామపక్షాల ప్రాబల్యమే కనిపిస్తోంది.
అలాంటప్పుడు ఏదో మోడీ దెబ్బతిన్నట్లుగా, తాము బలపడినట్లుగా మురిసిపోవడం కంటె.. వాస్తవాల్ని గుర్తించి.. ఈ రెండేళ్ల ప్రతిపక్ష హోదాలో కొత్తగా తమ మీద ప్రజలు పెంచుకుంటున్న నమ్మకం కూడా ఏమీ లేదని కనీసం కాంగ్రెస్ ఇప్పటికైనా గుర్తిస్తే వారికి భవిష్యత్తు ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.