తెలుగుదేశం పార్టీ అధినేత.. చంద్రబాబునాయుడు చేస్తున్న జాతీయ రాజకీయాలతో.. ఏపీలో కూడా మెల్లగా సమీకరణాలు మారుతున్నాయి. కొంత కాలం కిందట వరకూ ఏపీలో… కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉండేది కాదు. ఆ పార్టీకి మిగిలి ఉన్న నేతలు.. వైసీపీ బీ టీం అన్నట్లుగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తీరు మారిపోయింది. తమ ఓటు బ్యాంకుల్ని మళ్లీ దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాయలసీమలో తమకు అనాదిగా అండగా ఉంటున్న సామాజికవర్గాన్ని దువ్వడం ప్రారంభించారు. ఇక ముస్లిం, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలపై దృష్టి పెట్టారు. వీరంతా తమ వైపు రావాలంటే.. ఇప్పుడు.. ఆయా వర్గాలను.. తన వైపు తిప్పుకున్న జగన్మోహన్ రెడ్డిని గురి పెట్టాలి. ఇంత కాలం.. ఈ విషయం వాళ్లకు తెలియక కాదు.. కానీ ఇప్పుడు తప్పనిసరిగా విమర్శించాల్సిన పరిస్థితులు వచ్చాయి. అందుకే రఘువీరారెడ్డి లాంటి నేతలు.. కూడా.. ఇప్పుడు వైసీపీపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. మోదీ, కేసీర్‌కు జగన్ ఏజెంట్ అని ఘాటుగానే విమర్శిస్తున్నారు.
నిజానికి పేరుకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం అయినా.. అది .. వైసీపీ స్టాండ్ నే ఫాలో అయ్యేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ.. కొంత మంది జగన్ వెల్ విషర్స్ .. ఏపీ కాంగ్రెస్ లో ఉన్నారని.. కొన్ని పరిణామాలు తరచూ బయటపెడుతూ ఉంటాయి. కొద్ది రోజుల క్రితం.. ఓ ఎంపీ..పోలవరంపై.. వైసీపీ వాదనను.. ఓ వీడియో ప్రజెంటేషన్ రూపంలో… ఏకంగా.. ఏపీ కాంగ్రెస్ కార్యాలయంలోనే ప్రదర్శించి చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విషయం హైకమాండ్ వరకూ వెళ్లింది. వైఎస్ హయాంలో ఆయన కనుసన్నల్లో చక్రం తిప్పిన నేతలే.. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. వారిది ప్రత్యేకమైన అజెండా.. ఢిల్లీ రాజకీయాలు ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం..తమ ఎజెండాను అమలు చేయాలనుకుంటారు. కానీ రాహుల్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పరిస్థితి మారిపోయింది.
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు… ఓ రకంగా ఒత్తిడిలో ఉన్నారు. జగన్ నాయకత్వ సామర్థ్యంపై.. అందరిలోనూ అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఓ వైపు పవన్ కల్యాణ్.. కొన్ని ప్రాంతాల్లో.. వైసీపీని దారుణంగా దెబ్బకొడుతున్నారు. మరో వైపు.. అండగా ఉంటున్న ఓటు బ్యాంకుల్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఓ వైపు పవన్ నుంచి వచ్చే సవాళ్లను..మరో వైపు.. కాంగ్రెస్ నుంచి వస్తున్న ముప్పును.. కనిపెట్టుకుని… ఎలా తిప్పికొట్టాలో జగన్ కు అర్థం కావడం లేదు. ఇలాంటి సమయంలో.. ఢిల్లీ నుంచి చంద్రబాబు వేస్తున్న రాజకీయ ఎత్తులు జగన్‌కు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చి పెడుతున్నాయి. కాంగ్రెస్‌లోని ఆయన ఫ్యాన్స్.. ఇక సాయం చేయడానికి కూడా.. పనికి రానంత స్థాయికి దిగజారిపోతున్నారు.