గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోడి ఆంద్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా, ఆర్ధిక సహాయం, ప్రాజెక్టులు వగైరాల కోసం హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నిటిని ఆయన నెరవేర్చారు కానీ అసలయిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు. అవి నెరవేర్చే ఉద్దేశ్యం లేనట్లే దాదాపు స్పష్టం అవుతోంది. ఆంద్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన ఆ హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఇప్పుడు ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రానికి రూ.1.65 లక్షల కోట్లు భారీ ఆర్దిక ప్యాకేజీ ప్రకటించారు. అప్పుడు ఆంద్రప్రదేశ్ లో దీనిపై చాలా చర్చలు జరిగాయి కూడా.
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో కొంచెం ఆలశ్యం మేల్కొన్నప్పటికీ మంచి సరయిన సమయంలో బీజేపీని నిలదీయడానికి సిద్దం అవుతోంది. “ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి వచ్చేలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అమలుచేయడానికి నిర్దిష్ట గడువును ప్రకటించాలి. లేకుంటే మేము బీహార్ వెళ్లి అక్కడి ప్రజలకు నరేంద్ర మోడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏవిధంగా మోసం చేసింది వివరిస్తాము. బీహార్ రాష్ట్రానికి ఆయన ప్రకటించిన రూ.1.65 లక్షల కోట్లు ఆర్దిక ప్యాకేజీ అక్కడి ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లు పొంది ఎన్నికలలో గెలిచేందుకే ఆ హామీని ప్రకటించారు తప్ప దానిని ఆయన అమలుచేయబోరని తాము ప్రచారం చేస్తామని,” ఆంద్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు.
బీహార్ అసెంబ్లీకి ఐదు దశలలో ఎన్నికలు నిర్వహింపబడతాయి. వాటిలో రెండు దశలు ముగిసాయి. ఒకవేళ రఘు వీరారెడ్డి హెచ్చరిస్తున్నట్లుగా రాష్ర్ట కాంగ్రెస్ నేతలు బీహార్ వెళ్లి ఇదే విషయం గట్టిగా ప్రచారం చేసినట్లయితే బీజేపీ పట్ల ప్రజలకి అపనమ్మకం కలిగితే దాని విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగని నరేంద్ర మోడి ఇప్పటికిప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తదితర హామీలను అమలుచేస్తానని చెప్పడం కూడా కష్టమే. కనుక కాంగ్రెస్ వేసిన ఈ ఎత్తుగడను ఎదుర్కోవడానికి బీజేపీ ప్రతివ్యూహం సిద్దం చేసుకోకతప్పదు. కానీ ఆంధ్రా కాంగ్రెస్ నేతలలో చాలా మందికి సరిగ్గా హిందీ మాట్లాడటం రాదు. కనుక వారు అక్కడికి వెళ్లి దీని గురించి బీహార్ ప్రజలకు అర్ధమయ్యేలా వివరించడంకంటే జాతీయ కాంగ్రెస్ నేతలే ఈ విషయం గురించి బీహార్ లో గట్టిగా ప్రచారం చేసుకొంటే మంచిదేమో?