తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు, డిండి ఎత్తిపోతల పధకాలపై మొట్టమొదట ఏపిలో కాంగ్రెస్ పార్టీయే అభ్యంతరం తెలిపింది. ఆ తరువాతే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు దానిని అందిపుచ్చుకొన్నారు. దానిపై రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నేతలు సహజంగానే తమ తమ ప్రాంతాలకి అనుకూలంగా వాదిస్తున్నారు. తెలంగాణా కాంగ్రెస్ ఎంపి వి.హనుమంత రావు ఆ ప్రాజెక్టులను గట్టిగా సమర్ధిస్తూ, దానిని వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే, ఆంధ్రా కాంగ్రెస్ నేతలు రఘువీరా రెడ్డి, తులసి రెడ్డి తదితరులు తెరాస, తెదేపా ప్రభుత్వాలని విమర్శిస్తున్నారు. అలాగే తెదేపా, తెరాస ప్రభుత్వాధినేతలు కూడా అప్పుడే ఒకరినొకరు విమర్శించుకోవడం మొదలుపెట్టారు. ఈ సమస్యపై ఆంధ్రాలో పార్టీలు రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుంటే, తెలంగాణా ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల పనులను చేసుకుపోతూనే ఉంది.
ఏపి కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి పాలమూరు, డిండి ప్రాజెక్టుల గురించి కొన్ని ఆసక్తికరమయిన వివరాలు నిన్న బయటపెట్టారు. ఆ రెంటికీ ఎటువంటి అనుమతులు లేవని చెపుతూనే, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే డిండి ప్రాజెక్టు కోసం జి.ఓ. (నెంబర్:159) జారీ చేసారని, దాని కోసం రూ.1.3 కోట్లు మంజూరు చేసారని తెలిపారు. ఆ తరువాత అధికారం చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సర్వే కోసం 2013లో జి.ఓ.(నెంబర్:72)ను జారీ చేసారని, దాని కోసం రూ. 6.91 కోట్లు మంజూరు చేసారని తెలిపారు.
రాష్ట్ర విభజన తరువాత కేసీఆర్ ప్రభుత్వం వాటి కోసం జూన్ 15,2015లో జి.ఓ (నెంబర్:107) జారీ చేసిందని తెలిపారు. వాటిలో శ్రీశైలం ప్రాజెక్టు కోసం రూ. 35,200 కోట్లు, డిండి ప్రాజెక్టు కోసం రూ.6,190 కోట్లు మంజూరు చేసిందని తులసి రెడ్డి తెలిపారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులకి ఎటువంటి అనుమతులు లేకపోయినా తెలంగాణా ప్రభుత్వం నిధులు కేటాయించి, పనులు చేపడుతోందని విమర్శించారు. తెలంగాణా నీటి పారుదల శాఖ మంత్రి ఆ ప్రాజెక్టుల గురించి అబద్దాలు చెపుతూ తిరిగి ఏపి ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారని, అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేంద్రానికి పిర్యాదు చేసి ఆపకుంటే, కృష్ణా, రాయలసీమ జిల్లాలకు భవిష్యత్ లో నీటి కరువు తప్పదని హెచ్చరించారు.
ఆ ప్రాజెక్టులకు ఎటువంటి అనుమతులు లేవని, అయినా సమైక్య రాష్ట్రాన్ని వరుసగా పరిపాలించిన ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వాటి కోసం జీవోలు జారీ చేసి నిధులు కూడా కేటాయించారని తులసి రెడ్డే స్వయంగా చెపుతున్నారు. మరి ఇప్పుడు ఆయన వాటిని ఎందుకు తప్పు పడుతున్నారు? అంటే రాష్ట్ర విభజన తరువాత ఆయన ఏపికే పరిమితమయ్యారు కనుక. ఏపికి చెందిన ఆయన ఈ ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపుతుంటే, తెలంగాణాకి చెందిన వి.హనుమంత రావు వాటికి మద్దతు తెలుపుతున్నారు. ఇద్దరూ ఒకే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే కానీ పూర్తి భిన్నంగా వాదిస్తున్నారంటే ఆ ప్రాజెక్టు పేరుతో రాజకీయం చేస్తూ దానిపై ఎంతో కొంత రాజకీయ మైలేజి పొందడం కోసమేనని అర్ధమవుతోంది. రాజకీయ పార్టీలు ఒక సున్నితమయిన, క్లిష్టమయిన సమస్యని ఏవిధంగా సామరస్యంగా పరిష్కరించాలని ఆలోచించకుండా ఈవిధంగా రాజకీయాలు చేయడం చాలా శోచనీయం.