తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ ఏపి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాళ్ళ విజయవాడలో ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నా చేసింది. పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, దేవినేని నెహ్రు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రాకి నీళ్ళు రాకుండా చేస్తే చూస్తూ ఊరుకోమని దేవినేని నెహ్రూ తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుని హెచ్చరించారు. రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసినా తెదేపా ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను అడ్డుకొనే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండిపోయినా తాము రాష్ట్ర ప్రజలతో కలిసి ఉద్యమం తీవ్రతరం చేసి ఆ ప్రాజెక్టులను అడ్డుకొంటామని హెచ్చరించారు.
కొన్ని రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి తెలంగాణా ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ కర్నూలులో నిరాహార దీక్ష చేశారు. మళ్ళీ ఇవ్వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తోంది. రెండు పార్టీలు కూడా ఒకే సమస్యపై పోరాడుతున్నప్పుడు, అవి కలిసి ఎందుకు పనిచేయడం లేదు? ఎవరి ఉద్యమం వారిదే అన్నట్లుగా ఎందుకు వ్యవహరింస్తున్నాయి? అని ఆలోచిస్తే అవి ఈ సమస్య పరిష్కారం కోసం కాక దానిని తమ రాజకీయ మనుగడ కోసం వాడుకొంటున్నట్లు స్పష్టం అవుతోంది. రెండు పార్టీల నేతలు కూడా మిగిలిన పార్టీలని తమతో కలిసి పోరాడేందుకు రమ్మని పిలుస్తుంటారు కానీ వారు మాత్రం ఇతర పార్టీలతో కలిసి పోరాడటానికి ఇష్టపడరు సంఘీభావం ప్రకటించరు. కనీసం గుర్తించడానికి కూడా ఇష్టపడరు. ఈవిధంగా ఐకమత్యం, చిత్తశుద్ది లేని పోరాటాలు ఎన్ని చేసినా వృధాయే. వాటి వలన ఆ పార్టీలు సాధించేదేమీ లేకపోయినా, తెరాస నేతల దృష్టిలో మరింత చులకన అవుతారు. వారి వలన రాష్ట్రం కూడా చులకనవుతుంది.