ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక వ్యూహంతోనే రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తోంంది. షర్మిల ప్రత్యేకంగా ఓ బ్యాకప్ టీముని ఏర్పాటు చేసుకుని కీలకమైన నియోజకవర్గాల్లో అవకాశం ఉన్న చోట ప్రభావం చూపే నాయకుల్ని ఆకర్షించి మరీ టిక్కెట్లు ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికి నలుగురు ఎమ్మెల్యేలు, ఓ కేంద్ర మాజీ మంత్రి వైసీపీలో చేరి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలంతా దళితులే. అంతే కాదు నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఖరారు చేసిన వారిలో చాలా మంది తమ తమ సామాజికవర్గాల్లో అంతో ఇంతో పట్టున్నవారే. పైగా ఆర్థికంగానూ బలంగా ఉండే వారిని ఎంపిక చేసుకున్నారు.
నందికొట్కూరు నుంచి ఆర్థర్, చింతలపూడి నుంచి ఎలీజా, పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వీరంతా వైసీపీకి వీర విధేయులు. అయినా ఆ పార్టీని వదిలేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టిక్కెట్ ఇవ్వకపోయినా చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న తర్వాత షర్మిల టీం చర్చలు జరిపి వీరిని పోటీకి అంగీకరింప చేసింది. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి .. జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ లో చేరి.. టెక్కలి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.
ఇలా కనీసం 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల్ని నిలబెడుతోంది. అయితే వీరి బలం గెలవడానికి సరిపోదు. కానీ ఓడించడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఏ స్థానంలోనూ నోటాను మించి ఓట్లు రాలేదు. కానీ ఈ సారి షర్మిల ప్రభావం గట్టిగా కనిపించనుంది. కీలకమైన స్థానాల్లో పది నుంచి పదిహేను వేల ఓట్లు చీలిస్తే పోటీలో ఉన్న కొంత మంది అభ్యర్థుల జాతకాలు తారుమారు అవుతాయి. అంత బలం చూపించేవారినే అభ్యర్థులుగా ఖరారు చేశారు.
1999 ఎన్నికల సమయంలో టీడీపీ ఓట్లను చీల్చడానికి లోక్ సత్తా పోటీ చేసింది. రెండు శాతం ఓట్లు చీల్చింది. లోక్ సత్తా పోటీ చేయకపోతే వారు ఎవరికి ఓటు వేస్తారో చెప్పాల్సిన పని లేదు. ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ గెలిచింది.. ఈ సారి కాంగ్రెస్ పార్టీ లోక్ సత్తా కన్నా ఎక్కువగా నాలుగైదు శాతం ఓట్లు చీల్చబోతోంది. ఎవరికి నష్టమో ఎన్నికల ఫలితాలు తేల్చేసే అవకాశం ఉంది.