స్థానిక ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. పార్టీ పరంగా తన అభిప్రాయం చెప్పడానికి నిరాకరించిన వైసీపీ… అధికారికంగా మాత్రం సీఎస్ నీలం సహానితో నిమ్మగడ్డకు ప్రభుత్వ ఆలోచనను చర్చించేందుకు పంపించింది. ప్రస్తుతం కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్నందున.. మళ్లీ నవంబర్‌లో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంలో లేదని నీలం సహాని చెప్పినట్లుగా తెలుస్తోంది. అందరి అభిప్రాయాలను తెలుసుకుని నిమ్మగడ్డ కోర్టుకు నివేదించే అవకాశం ఉంది.
దేశంలో కరోనా ఎమర్జెన్సీ విధించిన సమయంలో… ఎన్నికలు వాయిదా వేసినప్పుడు.. సీఎస్‌గా నీలం సహానీనే ఉన్నారు. అప్పుడు.. ఎన్నికల వాయిదా వేసినందుకు నీలం సహానీ.. ఎస్ఈసీకి ఘాటుగా లేఖలు రాశారు. అది వివాదాస్పదం కూడా అయింది. కరోనా ఉద్ధృతి పెరిగే సరికి ఇంకా చాలా సమయం ఉంటుందని.. ఎన్నికలు నిర్వహించాలని ఆ లే్ఖల్లో పేర్కొన్నారు. ఎస్ఈసీకీ సీఎస్ ఇలా లేఖ రాయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమన్న చర్చ జరిగింది. ఇప్పుడు మాత్రం రివర్స్‌లో నీలం సహానీ… ఎన్నికలు నిర్వహించవద్దని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఉదయం రాజకీయ పార్టీల అభిప్రాయాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుసుకున్నారు. తాము ఎన్నికల నిర్వహణ విషయంలో ఉత్తమమైన పద్దతుల్ని పాటిస్తున్నామని ఆయన చెబుతున్నారు. మూడు రోజుల కిందట.. ఎన్నికల నిర్వహణపై… సీఎంవో ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాష్ సమీక్షా సమావేశం పెట్టాలనుకున్నారు. దానిపై.. నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సారీ చెప్పారు.