ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా రూ. లక్ష కోట్ల అప్పులు చేస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే కాగ్ రిపోర్ట్ మాత్రం.. గత ఏడాది ఏపీ సర్కార్ రూ. 53702 కోట్లు మాత్రమే అప్పు చేసిందని నివేదిక విడుదల చేశారు. దీంతో… అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఇంతకు ముందు నెలలవారీగా విడుదల చేసిన కాగ్ లెక్కలకు… ఇప్పుడు ఏడాది మొత్తానికి విడుదల చేసిన కాగ్ లెక్కలకు చాలా తేడా కనిపిస్తోంది. అందుకే ఈ ఆశ్చర్యం. కాగ్ లెక్కలు ప్రభుత్వం సమర్పించే పత్రాల ఆధారంగానే ఉంటాయి. చివరికి కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. అప్పుడు వారు ఆడిటింగ్‌లో గుర్తించిన లోపాలు.. అవకతవకలు బయటపెడతారు. ఈ కాగ్ నివేదికను ఏపీ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదు.
బడ్జెట్ బారోయింగ్స్ రూ. 53702 కోట్లు ఉన్నాయి. కాగ్ లెక్కల్లోకి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రావు. అంటే.. కార్పొరేషన్ల పేరుతో.. ఇతర వాటితో తీసుకునే రుణాలు. ఏపీ సర్కార్ గ్యారంటీల ద్వారా తెచ్చే రుణాలు ఉంటాయి. వాటిని డైరక్ట్ ప్రభుత్వ అప్పులుగా చెప్పరు. అలాంటివే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెడికల్ కార్పొరేషన్ వంటి వి ఏర్పాటు చేసి.. ఎఫ్ఆర్బీఎం చట్టం కళ్లుగప్పేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను తేవడం ద్వారా నిధుల సమీకరణ చేపట్టడం వంటివి చేస్తోంది. 2020-21 రాబడుల ప్రకారం గ్యారంటీలు ఇచ్చేందుకు గరిష్ట పరిమితి రూ. 1,06,200కోట్లు కాగా, మార్చి 2021నాటికి ఇచ్చిన గ్యారంటీలు బడ్జెట్ లో చెప్పినవే రూ. 91,330కోట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 21,500కోట్ల గ్యారంటీ ఇచ్చి రూ. 18,500కోట్లు రుణం తీసుకుంది. ఇది ఆ ఖాతాలో వేయలేదు.
వీటన్నింటిపై కాగ్ ఏమాత్రం నిశిత దృష్టి సారించినా అనేక ఆర్ధిక అవకతవకలు బయటపడటం తథ్యం. మొన్న ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ప్రకారమే రాష్ట్ర అప్పులపై రాబోయే సంవత్సరానికి వడ్డీల కింద 23వేల కోట్లు చెల్లించాల్సి వుంటుంది. వాస్తవిక లెక్కలు చూస్తే అది రూ. 30వేల కోట్ల పైబడే ఉండవచ్చనేది ఓ అంచనా. ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కళ్లు కూడా కప్పేందుకు ప్రయత్నిస్తోందని తాజా లెక్కలతో స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.