ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదాపై యువత ఉద్యమించిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో ఆంధ్రా యువత శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంపూర్ణ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్వీట్లు, పాటల ద్వారా యువతను ఉత్తేజపరిచారు. అయితే, విశాఖ కార్యక్రమాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అణచివేసిందనే అభిప్రాయం వ్యక్తమౌతున్న తరుణంలో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రసంగ పాఠం ఆయన మాటల్లోనే…
‘‘కొన్ని దశాబ్దాలుగా పరిష్కరించాల్సిన సమస్యలున్నాయి. వాటి విషయంలో ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి. ఆ ఆవేదనతో జనసేన పార్టీ స్థాపించాను. పదవిలో రాకముందు చంద్రుడిని సైతం భూమ్మీదికి తీసుకొస్తామని ఆశలు కల్పించి… అధికారంలోకి వచ్చాక కుంటి శాఖలు చెప్పి తప్పుకుంటూ ఉండటం నాకు అస్సలు నచ్చలేదు. నా ఒక్కడికే కాదు… కోట్ల మంది ప్రజలకు ఇదే బాధ ఉంది. పార్టీ స్థాపనకు కారణం ఇదే.
తెలుగుదేశం, భాజపాకి సపోర్ట్ చేయడానికి కారణం… దేశం సమస్యలో ఉంది. మోడీ సమస్యల్ని అర్థం చేసుకుంటారని అనుకున్నాను. పదేళ్లు అధికారంలో లేని తెలుగుదేశం అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు అనుకుని సపోర్ట్ చేశాను. వారి జెండా నేను మోశాను. కానీ, వారు ఇచ్చినమాట తప్పారు. వారికి సపోర్ట్ చేసినప్పుడు…రాజకీయ అనుభవం ఉందా అని భాజపా నాయకులు ప్రశ్నించలేదు. నన్ను రకరకాలుగా తిప్పారు. ఆరోజు నా అనుభవం గురించి అడగలేదు. ఇవాళ్ల ప్రత్యేక హోదా గురించి అడిగితే… ముందుగా రాజకీయాల్లో ఏబీసీడీలు నేర్చుకుని రా అంటున్నారు. ఇంతకుమించిన అవకాశవాదం కనిపించలేదు.
కేంద్రంలో భాజపా, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. ఇన్నాళ్లూ ప్రభుత్వాల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కారణం ఏంటంటే… అన్నీ రూల్ బుక్స్ ప్రకారం నడపలేం. ఓటుకు నోటు కేసు సమయంలో మాట్లాడకపోవడానికి కారణం… అది కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే చేసి ఉంటే కచ్చితంగా నిలదీసేవాడిని. అన్ని పార్టీలూ హార్స్ రైడింగ్ చేస్తాయి. అన్ని పార్టీలూ ఇదే ధోరణిలో ఉంటున్నాయని కాస్త తక్కువగా మాట్లాడాను. ప్రతీదానికీ గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు. ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేయడం ద్వారా ప్రజలు ఇబ్బందిపడతారని అనుకున్నాను. అంతేగానీ వాళ్లను వెనకేసుకుని రావడం కాదు.
ప్రజలు మనోభావాలను మీరు దృష్టిలోకి తీసుకోవడం లేదు. ఇది బాధాకరం. జల్లికట్టు ఉద్యమం… తమిళ ప్రజల ఆగ్రహం. భాజపాపై ఉన్న కోపాన్ని అలా వ్యక్తపరచారు. జల్లికట్టును అలా అర్థం చేసుకోవాలి. ప్రత్యేక హోదా గతించిన అధ్యాయం అంటున్నారు. వెంకయ్య నాయుడుగారూ… ప్రజలంటే ఆట్లాటగా ఉందా మీకూ? మీ స్వర్ణభారతి ట్రస్ట్‌పై పెట్టే మనసు… ఆంధ్రాపై పెడితే ఈపాటికి ప్రత్యేక హోదా వచ్చేది. మీరేమన్నా దేవుళ్లా… దిగొచ్చారా..? మేమందరం మీ బానిసలమా..? మేం ఈ దేశ ప్రజలం. ఇష్టానికి మాట్లాడితే కుదరదు. దయచేసి మా ఆవేదనను అర్థం చేసుకోండి. నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు.
నేను చంద్రబాబుకు సపోర్ట్ చేయడానికి కారణం… ఆయన పరిపాలనా అనుభవం చూసి. గత ఎన్నికల్లో నేను చెప్పింది కూడా ఇదే. కానీ, ప్రత్యేక హోదా విషయంలో ఆయన తప్పు చేస్తున్నారు. సరిదిద్దుకోవాలి. స్పెషల్ స్టేటస్ మీద ఎందుకు రాజీపడ్డారు..? సుజనా చౌదరి, రాయపాటి లాంటి వ్యక్తుల్ని మీరు పక్కన పెట్టుకుంటున్నారు. వాళ్లంటే గౌరవం ఉంది. వాళ్లంటే నాకు శతృత్వం లేదు. మీకూ నాకూ ఉన్నకామన్ అజెండా కలిసి ప్రజలకోసం పనిచేయడం. అది జరగనప్పుడు నేనెందుకు మీపక్షం ఉండాలి..? సుజనా చౌదరి అంటారూ… ఆ స్ఫూర్తితో పందుల పందాలు అంటారు. ఇదేనా ప్రజల ఉద్యమంపై స్పందించే తీరు..?
మీరు బెటర్ గవర్నెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. శాంతియుత నిరసన చేద్దామనుకున్నయువతకు పర్మిషన్ ఇచ్చుండాల్సింది. అది వాళ్లు నిర్ణయించుకున్నది. జనవరి 26 సెలవు కాబట్టి… కలిసి కేంద్రానికి తమ వాయిస్ వినిపిద్దామనుకున్నారు. ఒక గంట పర్మిషన్ ఇచ్చుండాల్సింది. ఈరోజున ఒక ఉధృతిని మీరు ఆపారు. వాయిదా వేయగలిగారు. అంతేగానీ… తీవ్రతను ఆపలేరు.
మోడీగారూ.. మిమ్మల్ని నమ్మకంతో గెలిపించారు. కానీ, మీరు భయపెట్టి పాలిస్తా అంటే ఎట్టా..? అలా కుదరదు. కేవలం పోలీసులతోనే ప్రతీదీ చేద్దామంటే కుదరదు. పాలసీల ద్వారా ప్రజలకు మీరు కమ్యూనికేట్ చేయాలి. గోటి పోయేది గొడ్డలిదాకా తీసుకురావొద్దు.. దయచేసి. తీరు మార్చుకోకపోతే… మేమూ తిరగబడాల్సి ఉంటుంది. నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చాను పాలిటిక్స్‌కి. ఆ విషయం గుర్తించుకోండి. దక్షిణాదిని గౌరవించడం నేర్చుకోండి. ఓట్ల కోసమే మమ్మల్ని వాడుకుంటారా..? తీరు మార్చుకోకపోతే పరిస్థితి తీవ్రంగా మారుతుంది”.