ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే బాణీలో మాట్లాడారు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. తెలంగాణలో చెప్పిన విధంగానే లెక్కలు చెప్పారు. కేంద్రం నుంచి ఆంధ్రాకు అందిన సాయం వల్లెవేశారు. ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడుతూ… ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదని అందరూ భాజపాని ప్రశ్నిస్తున్నారనీ, కానీ దానికి మించిన ప్రయోజనాలను ఆంధ్రాకి అందించామని అమిత్ షా అన్నారు. రూ. 1.75 లక్ష కోట్లను వివిధ పథకాల రూపంలో ఆంధ్రాకి కేంద్రం ఇచ్చిందని వివరించారు.
రాష్ట్రంలో ఎన్నో రకాల సంస్థల్ని కేంద్రం ఏర్పాటు చేసిందనీ, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కూడా కల్పించామని అమిత్ షా అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతీ రూపాయీ కేంద్రం ఇచ్చిందే అని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ సర్కారు ఆధ్వర్యంలో మొత్తంగా 106 రకాల ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తు ఉందనీ, భాజపా నాయకుడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నారనీ, ఆయన శాఖ ఎన్నో విజయాలు సాధించిందని అమిత్ షా మెచ్చుకోవడం విశేషం! విజయవాడ పట్టణం భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందించే వాడగా మారాలని ఆకాంక్షించారు. ఇకపై రాష్ట్రంలో తరచూ పర్యటిస్తుంటానని, ఎవ్వర్నీ నిద్రపోనివ్వనని కార్యకర్తలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ సభలో చెప్పారు.
తెలంగాణలోగానీ, ఆంధ్రాలోగానీ అమిత్ షా చేసిన ప్రసంగాలు ఎలా ఉంటున్నాయంటే… తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల కంటే, కేంద్రంలో ఉన్న తామే ప్రజలకు ఎంతో చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామన్నారు, ఆంధ్రాకు అంతకుమించి ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఇంతకీ… కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన.. ఈ సొమ్మంతా, లేదా ఈ సాయమంతా, లేదా అమలు చేస్తున్న ఈ పథకాలన్నీ భాజపా దయాభిక్షగానో వితరణ శీలతగానో చెప్పుకోవడం ఎంతవరకూ కరెక్ట్..? కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్యాంగ ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలూ, విడుదల చేయాల్సిన నిధులు ఇవ్వడం అనేది ఒక రొటీన్ ప్రాసెస్. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అలానే పాలించింది. అంతకుముందున్న ఇదే భాజపా కూడా అదే చేసింది.
కానీ, ఇప్పుడు అమిత్ షా చెబుతున్నది ఎలా ఉందంటే… కేంద్రం నుంచి విడుదల అవుతున్న నిధులున్నీ తమ సొంత పార్టీ ఫండ్ నుంచి ఇస్తున్నట్టుగా క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భాజపాని విస్తరించుకోవడం తప్పులేదు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన.. ప్రభుత్వం చేస్తున్న పనుల్ని పార్టీ విస్తరణలో భాగంగా ప్రచారాస్త్రాలుగా మార్చుకోవడం ఎంతవరకూ కరెక్ట్..?