ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ మనస్థాపానికి గురయ్యారు. తనపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని.. వాటిని మీడియా ప్రచురిందని.. అందుకు తక్షణం సారీ చెప్పాలని లేకపోతే పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేస్తామని నోటీసులు పంపించారు. డ్రగ్స్ అంశంపై ఏపీలో రాజకీయ దుమారం రేగింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో దొరికిన డ్రగ్స్‌ను ఏపీలోని అషి ట్రేడింగ్ కంపెనీ దిగుమతి చేసుకుంది. అప్పట్నుంచి డ్రగ్స్ కేంద్రంగా ఏపీలో రాజకీయం నడుస్తోంది. టీడీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. డీజీపీ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన విమర్శలు, బయట పెట్టిన అంశాలు పలు పత్రికల్లో వివిధ రకాల హెడ్డింగ్లతో ప్రచారం అయ్యాయి. రాజకీయ నేతలు చేసిన ప్రకటనలను ఆయా పత్రికలు ప్రచురించాయి. ఇలా వ్యాఖ్యలు చేయడం.. వాటిని ప్రచురించడాన్ని డీజీపీ తప్పు పడుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు చంద్రబాబు సహా ఆరోపణలు చేసిన టీడీపీ నేతలందరికీ నోటీసులు పంపించారు. అయితే నేరుగా డీజీపీ ఇవ్వలేదు. డీజీపీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు.
రాజకీయ నేతలు ప్రకటించడం.. వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించాయని నోటీసుల్లో పేర్కొన్నారు. టీడీపీ నేతలు, మీడియాసంస్థలు పోలీసులకు క్షమాపణలు చెప్పాలని లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. ప్రజాస్వామ్యం గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నా.. ఇలాంటి నోటీసులు ఇవ్వరన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వినిపిస్తోంది. రాజకీయ నేతలు చేసిన ఆరోపణలకు డీజీపీ స్పందించడం.. మీడియా ప్రచురించడమే తప్పన్నట్లుగా నోటీసులు ఇవ్వడం డీజీపీ స్థాయిలో లేదని అంటున్నారు.