గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వంతో అంటకాగి, జగన్ సర్కార్ అరాచకాలకు అండగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లకు ఏపీ డీజీపీ మెమోలు జారీ చేశారు. సదరు అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం వెయిటింగ్ లో పెట్టగా… ఆ అధికారులు హెడ్ క్వార్టర్స్ లో ఉండేలా మెమో ఇచ్చారు.
వెయిటింగ్ లో ఉండి హెడ్ క్వార్టర్ లో అందుబాటులో లేని ఐపీఎస్ లు పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, కాంతిరాణ టాటా, కొల్లి రఘురామరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవికాంత్ రెడ్డి సహా మొత్తం 16మంది అధికారులకు మెమోలు జారీ అయినట్లు తెలిసింది.
వెయిటింగ్ లో ఉన్న అధికారులంతా ఉదయం 10గంటల నుండి సాయంత్రం వరకు హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని… విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.
వేటు పడ్డ తర్వాత సదరు అధికారులు అందుబాటులో లేకపోవటంతో డీజీపీ మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
జగన్ సర్కార్ ఉన్నప్పుడు ఈ అధికారులు తప్పుడు కేసులు నమోదు చేయటం, వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొత్త ప్రభుత్వం రాగానే చేపట్టిన బదిలీల్లో సదరు అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచారు.