ముంబై నటిని ఏపీ ఐపీఎస్ అధికారులు తప్పుడు కేసులతో వేధించిన వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభమయిందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. తప్పు చేసిన ఎవరూ తప్పించుకోలేరని.. స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున త్వలోనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఓ వివాదంలో తప్పుడు కేసు పెట్టి.. కాదంబరి జత్వానీ అనే నటితో పాటు ఆమె కుటుంబాన్ని విజయవాడకు తీసుకు వచ్చి నలభై రోజులకుపైగా బంధించి చిత్రహింసలు పెట్టినట్లుగా పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పటి కమిషనర్ , డీసీపీతో పాటు పలువురు కిందిస్థాయి అధికారులు ఈ వ్యవహారంలో పాలు పంచుకున్నారు. సీఐ స్థాయి అధికారులు ఇప్పటికే జరిగింది ఏమిటో మొత్తం ఇంటలిజెన్స్ తోపాటు.. కమిషనర్ రాజశేఖర్ బాబుకు వివరించినట్లుగా తెలుస్తోది. దీనిపై ఇప్పటికే ఇంటలిజెన్స్ రిపోర్టుతో పాటు విజయవాడ కమిషనర్ కూడా సీఎంవోకు నివేదిక సమర్పించారు.
రేపోమాపో… కాదంబరి జత్వానీ విజయవాడకు వచ్చి అధికారికంగా ఫిర్యాదుచేయనుంది. అప్పటికే పోలీసులు వ్యవహారంలో మొత్తం డీటైల్స్ బయటకు లాగనున్నారు. వివాదానికి కేంద్ర బిందువు అయిన కుక్కల విద్యాసాగర్ ప్రస్తుతానికి ఆజ్ఞాతంలో ఉన్నారు. ఆయన తప్పుడు డాక్యుమెంట్లతో కేసులు పెట్టడం.. విజయవాడ పోలీసులు అంతకు మించిన కేసు లేదన్నట్లుగా వ్యవహరించడం వివాదాస్పదయింది. వచ్చే వారం రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నారు. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు జైలుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.