అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జరిగిన వైయస్ వివేకానంద హత్య రాజకీయంగా సంచలనమైన సంగతి తెలిసిందే. అయితే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు ఈ హత్య కేసుపై త్వరగా ఏదీ తేల్చడం లేదనీ, విచారణను నీరుగార్చే దిశగా సాగుతోందనే ఆరోపణలూ చాలానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే దర్యాప్తుపై అధికారికంగా ఎప్పటికప్పుడు ఎలాంటి అప్ డేట్స్ లేకుండా పోయాయి. అయితే, ఎట్టకేలకు వివేకా హత్య కేసు మీద ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు.
వివేకా హత్యపై కొన్ని ఆరోపణలూ కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయనీ, వాటిలో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు సవాంగ్. కేసు విచారణ సమర్థంగా జరుగుతోందనీ, ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యానాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దర్యాప్తు విషయంలో పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతారన్నారు. అయితే, ఇప్పటికే కొంతమంది ఈ కేసు విచారణపై రకరకాల ఊహాగానాలు ప్రచారాలు చేస్తున్నారనీ, అలా చేస్తున్నవారికి నోటీసులు పంపించి వివరణ కోరతామని సవాంగ్ అన్నారు. గడచిన మూడు నెలల్లో వివేకా హత్య కేసులో చాలా చేశామన్నారు. రాజకీయంగా అనవసరంగా చేసే వ్యాఖ్యలు కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తాయన్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది! గడచిన మూడు నెలలుగా చాలా చేశామని సవాంగ్ చెప్పారు. ఇంతకీ, ఈ కేసు విచారణ ఎప్పటిలోగా పూర్తవుతుందనేది ఇంకా స్పష్టతలేని అంశంగానే కనిపిస్తోంది! చాలా చేసినప్పుడు… ఇంకా చెయ్యాల్సింది ఏముందో ఏమో మరి. ఇంకోటి.. ఈ కేసు నేపథ్యంలో వ్యాఖ్యానాలు చేసినవారికి నోటీసులు పంపుతామని అంటున్నారు. ప్రతిపక్ష నాయకులతోపాటు, అధికార పార్టీ నేతలు కూడా చాలానే వ్యాఖ్యానాలు చేశారు కదా! ఇది రాజకీయ హత్య అని టీడీపీ నేతలు అంటుంటే… వివేకా హత్యకు కుట్ర చేసిందే గత చంద్రబాబు నాయుడు సర్కారు అంటూ ఆ మధ్య చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. డీజీపీ వ్యాఖ్యల ప్రకారమైతే ఇవన్నీ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశాలవుతాయి కదా! మొత్తానికి, కేసు దర్యాప్తు సమర్థంగా, పటిష్టంగా, బలంగా, ఇంకా ఇంకా జరుగుతోందని స్పష్టం చేయడం జరగింది.