పధ్నాలుగు వేల ఖాళీలు ఉంటే పోలీసు శాఖలో కేవలం నాలుగు వందల పోస్టులు భర్తీ చేస్తున్నారని.. నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారంటూ ఓ ప్రధాన పత్రికలో వచ్చిన వార్త ఏపీ డీజీపీకి అసంతృప్తి కలిగించింది. సాయంత్రానికి ఆయన ఓ ప్రెస్‌నోట్ పట్టుకుని .. వచ్చి ప్రెస్మీట్లో చదివి వినిపించారు. ఆయన తన వాదన చాలా సమర్థంగా వినిపించారని అనుకున్నారేమోకానీ.. ఆ ప్రెస్‌నోట్‌ను ఎవరు ప్రిపేర్ చేయించారు.. అది మొత్తం మీడియా సమావేశంలోచదివితే ఎలాంటి అర్థం బయట ప్రపంచానికి తెలుస్తుందో మాత్రం.. కాస్త క్లారిటీ తెచ్చుకోలేకపోయారు.
గత ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో.. ఈ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో డీజీపీ లెక్క చెప్పారు. అలాంటి రాజకీయ విమర్శలు రాజకీయ నేతలు చేసుకుంటారు. గత ప్రభుత్వం గురించిప్రస్తావించాల్సిన అవసరం డీజీపీకి ఏముందో ఎవరికీ అర్థం కాలేదు. పైగా ఇప్పుడు.. ఈ ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పుకొచ్చారు. అవి ఇవ్వలేదనే కదా నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. వీటితో పాటు పోలీసు ఉద్యోగాల భర్తీ గురించి కూడా విచిత్రమైన వాదన చేశారు. అదేమిటంటే.. గ్రామ సచివాలయాల్లో నియమించిన పదిహేను వేల మంది మహిళా పోలీసుల్ని పోలీసు శాఖలో విలీనం చేసుకున్నారట. వారికి శిక్షణ ఇవ్వడానికి సమయం లేదని అందుకే కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడం లేదట.
అసలుపోలీసు ఉద్యోగానికి ఎంపికవ్వాలంటే.. ఎలాంటి ప్రక్రియ ఉంటుందో డీజీపీకి స్పష్టమైన అవగాహన ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. ఎవరినీ పడితే వారిని విలీనం చేసుకుని పోలీసు అనడానికి చట్టాలు ఒప్పుకుంటాయో లేదో ఆయన చెప్పాల్సి ఉంది. ఆ నియామకాల అంశం కోర్టులో ఉంది. పైగా అవి ఇప్పటికీ పర్మినెంట్ ఉద్యోగాలు కాదు. అయినా అధికార పార్టీ వాదించినట్లుగా డీజీపీ వాదించారు. దీనికి తోడు.. ఆ పదిహేను వేల మందికి శిక్షణ ఇవ్వడానికి తీరిక లేకుండా ఉన్నందున కొత్త పోస్టులు భర్తీ చేయడం లేదని చెప్పుకొచ్చారు. శిక్షణా సామర్థ్యం ఆరున్నర వేలే అని డీజీపీగారు చెప్పుకొచ్చారు. మరి ఆరున్నర వేలు అంటే… పదిహేను వేల మందికి దాదాపుగా మూడేళ్ల పాటు శిక్షమ ఇస్తారు. మరి అప్పటి వరకూ కొత్త పోలీసుల నియామకాలు జరపరా..?
పోలీసు శాఖలో గత రెండేళ్లలో నాలుగు వేల వరకూపోస్టులు భర్తీ చేసినట్లుగా డీజీపీ చెప్పుకొచ్చారు. కానీ నిరుద్యోగులు ఎప్పుడూ ఎలాంటి నోటిఫికేషన్లు వచ్చినట్లుగా గుర్తుచేసుకోలేకపోతున్నారు. ఎప్పుు ఆ ఉద్యోగాలు ఇచ్చారో కాస్త ప్రకటన చేయమంటున్నారు. అదే సమయంలో పదకొండు వేల ఖాళీలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. వచ్చే క్యాలండర్ అని డీజీపీ కబుర్లు చెబుతున్నారు. నిజానికి డీజీపీ ఇలా రాజకీయ సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏపీలో మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. డీజీపీ అయినా వైసీపీ సలహాదారుల్లా… సమస్యలపై ఉద్యమిస్తున్న వారికి.. మీడియాపై ఎదురుదాడి చేయడానికి ఏ మాత్రం మొహమాట పడటం లేదు.