వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రజల సొమ్మును పంచదారలా చేసుకుని తిన్న అనేక విభాగాల్లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఒకటి. ఆ అవినీతి అంతా బహిరంగమే. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో యాత్ర సినిమాకు డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటు వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాల పేరుతో డబ్బులు చెల్లించడం వంటివి చేశారు. ఇప్పుడు విజిలెన్స్ విచారణలో అన్నీ బయటకు వచ్చాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయింది.
మమ్ముట్టికి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా నిధులు చెల్లింపు
యాత్ర 2 సినిమాకు డిజిటల్ కార్పొరేషన్ కు సంబంధం లేదు. దానికి నిర్మాత, దర్శకుడు మహి వి రాఘవనే. అయితే అందులో నటించిన మమ్ముట్టికి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించారు. ప్రొడ్యూసర్ గా తన పేరు వేసుకుని యాత్ర 2 సినిమాలు చేసి హార్సిలీ హిల్స్ లో స్టూడియో పేరుతో స్థలాన్ని కూడా కొట్టేయబోయిన మహి వి రాఘవ్ ఈ డిజిటల్ కార్పొరేషన్ నిధుల్ని ఎక్కువగా నొక్కేశారు.
వీడియోల పేరుతో డబ్బులు డ్రా
ప్రభుత్వానికి వీడియోలు చేశామని అందుకే కోట్లకు కోట్లు ఇచ్చారని లెక్కలురాసేశారు. అసలు కథ ఏంటో డిజిటల్ కార్పొరేషన లెక్కలన్నీ బయటకు వచ్చాయి. విజిలెన్స్ నుంచి మొత్తం 72 పేజీల నివేదిక రెడీ అయింది. జగన్ హయాంలో డిజిటల్ కార్పొరేషన్లో రూ.171.9 కోట్లు ఖర్చు చేయగా, అందులో 37.20 కోట్లు దుర్వినియోగం అయింది. మమ్ముట్టికి రూ.50 లక్షలను ఈ కార్పొరేషన్ నుంచే చెల్లించారు. హైకోర్టు జడ్జిలను తిట్టిన కేసుల్లో జైలుకెళ్లిన సుమ తియ్యగుర వంటి వారికి కూడా ఈ ఖాతా నుంచే డబ్బులిచ్చారు. ఇలాంటివి చాలా ఉన్నాయి.
చిన్న వాసుదేవరెడ్డిపై కేసులు
వైసీపీ అధికారంలోకి రాగానే చిన్న వాసుదేవరెడ్డి అనే వ్యక్తికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. ఆయన ఓ డిజిటల్ మీడియా నిర్వహిస్తూ ఉంటారు. మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగడంతో కేసులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సీఐడీ అధికారులు.. విజిలెన్స్ సిఫారసు మేరకు కేసులు పెట్టి అరెస్టులు చేసే అవకాశం ఉంది.