ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు తాము దివాలా తీశామని…పరోక్షంగా న్యాయస్థానాలకు చెప్పుకుంటున్నాయి. తమ దగ్గర డబ్బుల్లేవని… తామకు విద్యుత్ సరఫరా చేసిన వారికి చెల్లింపులు చేయలేకపోతున్నామని హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వం చేసుకున్న పీపీఏల ప్రకారం బిల్లులు చెల్లించాల్సిందేనని మార్చి పదిహేనో తేదీన హైకోర్టు తీర్పు చెప్పి ఆరు వారాల గడువు ఇచ్చింది. కానీ ఆరు వారాల పాటు ఎలాంటి చెల్లింపులు చేయని ప్రభుత్వం.. ఇప్పుడు తమ దగ్గర డబ్బుల్లేవని అందుకే చెల్లింపులు చేయలేకపోతున్నామని హైకోర్టుకు చెబుతోంది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే సంప్రదాయేతర విద్యుత్ సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను రద్దు చేశారు. కానీ అవి కోర్టులో నిలబడలేదు. కేంద్రం హెచ్చరించినా పట్టించుకోలేదు. వాటి దగ్గర తీసుకున్న విద్యుత్‌కు బిల్లులు కూడా చెల్లించడం ఆపేశారు. పీపీఏల ప్రకారం విద్యుత్ తీసుకున్నా బిల్లులు ఇవ్వలేదు. దాంతో ఆ కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. విచారణ తర్వాత బకాయిలు, భవిష్యత్తు ధరలు పీపీఏల్లో పేర్కొన్న ప్రకారమే చెల్లించాలని రాష్ట్రప్రభుత్వానికి, డిస్కంలకు హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో అప్పటి వరకూ చెల్లించకుండా ఆపేసిన మొత్తం దాదాపుగా రూ . 20 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విద్యుత్ సంస్థలు పెద్ద ఎత్తున రుణాల ఊబిలో ఉన్నాయని .. ఆ సంస్థ ఆర్థిక కష్టాలను హైకోర్టు ముందు ఏకరువు పెడుతోంది ప్రభుత్వం. నిజానికి పీపీఏల నుంచి కరెంట్ తీసుకోకుండా .. బహిరంగ మార్కెట్లో రూ. ఇరవై యూనిట్ పెట్టి కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పీపీఏలను సమీక్షించడం వల్ల అంతర్జాతీయంగానూ పెట్టుబడిదారుల్లో ఏపీపై నమ్మకం పోయిందని కేంద్రం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. దావోస్ వంటి చోట్ల పెట్టుబడుల సదస్సుల్లోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. చివరికి ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం, జగన్ అనాలోచితంగా వ్యవహరిడంతో ప్రజలపై రూ. ఇరవై వేల కోట్ల భారం పడటమే కాదు.. విద్యుత్ సంస్థలు దివాలా అంచులకు చేరి… బిల్లులు చెల్లించలేని స్థితికి చేరాయని తెలుస్తోంది.
కట్టలేమంటున్న ప్రభుత్వం వాదనపై హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. విద్యుత్ సంస్థలకు పీపీఏల ప్రకారం చెల్లించడం విఫలమైతే.. తాను నేరుగా ఆర్బీఐ నుంచి రాష్ట్ర నిధులు చెల్లిస్తామని గతంలో కేంద్ర విద్యుత్ మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ కేసు విషయంలో హైకోర్టులో జరిగే విచారణ కీలకం కానుంది.