కొద్ది రోజుల క్రిందట హైదరాబాద్‌ను వరదలు చుట్టుముట్టాయి. తీవ్రమైన నష్టం జరిగింది. అదే సమయంలో ఏపీలో కూడా తక్కువేమీ కాదు. కొన్ని వేల హెక్టార్లలో పంట నష్టపోయింది. గ్రేటర్ ఎన్నికలు ఉండటంతో అప్పట్లో హైదరాబాద్ వరద రాజకీయంగా కీలకమయింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే… కేంద్ర బృందాన్ని హైదరాబాద్‌కు పంపించి నష్టం అంచనాలను వేయించారు. ఆ ఫలితం ఇప్పుడు కనిపించింది. వరద సాయం కింద తెలంగాణకు దాదాపుగా రూ.250కోట్లు విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొత్తం ఐదు రాష్ట్రాలకు ఈ సాయం అందించింది.తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, అసోం, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్‌లకు ఈ వరదసాయం అందింది.
ఆంధ్రప్రదేశ్ పేరు ఈ జాబితాలో కనిపించలేదు. హైదరాబాద్‌కు కేంద్ర బృందం వచ్చి… అంచనాలు వేసి వెళ్లిన తర్వాత… ఏపీ బీజేపీ నేతలు కూడా… ప్రత్యేకంగా కేంద్రమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి విజ్ఞప్తి చేసుకుని మరీ కేంద్ర బృందాన్ని రప్పించారు. వారు వచ్చారు. నష్టం అంచనాలు వేసి వెళ్లారు. కానీ… నష్టం ఏమీ రాలేదని అనుకున్నారేమో కానీ.. ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. కానీ ఏపీ సర్కార్ మాత్రం… కేంద్రానికి చాలా లేఖలు రాసింది. నివర్ తుఫాను సాయం చేయాలని కోరింది. ఆర్థిక మంత్రి బుగ్గన నెలలో మూడు విడుతలుగా ఢిల్లీకి వెళ్లి .. ఆర్థిక శాఖ అధికారులకు ఇచ్చే విజ్ఞాపన పత్రాల్లో కూడా వరద సాయం గురించి ఉంటుంది.. కానీ ఇవ్వలేదు.
ఏపీ సర్కార్ అసెంబ్లీలోనే ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి జగన్ పంట నష్టంపై నిజాయితీగా మదింపు చేశామని ప్రకటించారు. కానీ.. ఎలాంటి సాయం ప్రకటించారు. ఆ నిజాయితీ మదింపు ప్రకారం… అసాధారణంగా ఏమీ నష్టం జరగలేదన్న అంచనాకు ప్రభుత్వం వచ్చిందని అప్పట్లో అనుకున్నారు. కేంద్రం కూడా అదే భావించి…ఎలాంటి వరద సాయం చేయలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీసర్కార్ కూడా రైతులకు ఎలాంటి వరద సాయం చేయలేదు. ఇన్పుట్ సబ్సిడీ మాత్రమే… కొంత మందికి ప్రకటించారు. మొత్తానికి తప్పు ఎవరిదైనప్పటికీ… రైతులు మాత్రం అన్యాయమైపోయారు.