జగన్ పాలనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎలా చూసే వారో అందరికీ తెలిసిందే. చెప్పింది చేయాలి, ఆ నిర్ణయం పట్ల వారి ఆలోచనలు, అభిప్రాయాలను పట్టించుకోరు. ఇష్టం ఉన్నా లేకున్నా పాటించాల్సిందే. అందుకు ఉదాహరణే… ప్రతి రోజు ఉదయం పాఠశాలలో మరుగుదొడ్ల ఫోటోలు అప్లోడ్ చేసే బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించటం.
కానీ కూటమి సర్కార్ వచ్చాక… అందులోనూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యత తీసుకున్నాక ఉపాధ్యాయులకు రిలీఫ్ దొరికింది. యాప్స్, అప్లోడ్ ను పక్కన పెట్టేశారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు వేరే పనులు వద్దని స్పష్టం చేశారు.
తాజాగా, ప్రభుత్వం ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని నిర్ణయిస్తూ… ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు చేపట్టింది. దీని వల్ల ఇటు విద్యార్థులకు సరైన విద్య అందుతుందని భావిస్తోంది. సరిపడ ఉద్యోగులు లేకపోతే కొత్త టీచర్లు వచ్చే వరకు తాత్కాలిక పద్ధతిలో నియమించుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఇవి కూడా ప్రభుత్వం సొంతగా నిర్ణయం తీసుకోకుండా… ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని నిర్ణయించింది.
ఉపాధ్యాయ సంఘాలతో బుధవారం విద్యాశాఖ కమిషనర్ చర్చలు జరపబోతున్నారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందటం, విద్యార్థుల సౌకర్యాలు, టీచర్ల సమస్యలకు పరిష్కారాలపై చర్చించనున్నారు.
నిర్ణయం ఏదైనా… సదరు అధికారులతో చర్చించటం ద్వారా అందరికీ మేలు జరుగుతుందని, ముఖ్యంగా టీచర్లకు కూటమి సర్కార్ ఇచ్చే గౌరవం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.