ఏపీ విద్యామంత్రి బొత్స సత్యనారాయణ అత్యంత వివాదాస్పదమైన ప్రకటనలు అతి సులువుగా చేస్తూ.. తన పార్టీని.. ప్రభుత్వాన్నే కాదు.. తనను కూడా చులకన చేసుకుంటున్నారు. అయితే ఏంటి ? చేస్తే తప్పేంటి ? అని ఎలాంటి సమస్యకైనా వితండ వాదన చేయడమే కాదు.. సమర్థించుకుంటున్నారు. చివరికి తన డ్రైవర్ను హత్య చేసిన ఎమ్మెల్సీ విషయంలోనూ ఆయన అదే వాదన వినిపించారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయనను సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. బొత్స మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బొత్స ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతోందా అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
డ్రైవర్ను హత్య చేసిన ఎమ్మెల్సీ.. తర్వాత దర్జాగా పెళ్లిళ్లకు హాజరయ్యారు. దీన్ని బొత్స సత్యనారాయణ మాత్రం గొప్ప నిరపరాధికి అదే సాక్ష్యం అన్నట్లుగా చెప్పుకొచ్చారు. తప్పు చేయలేదనే ధైర్యంతోనే ఎమ్మెల్సీ అలా బహిరంగంగా పెళ్లిళ్లకు వెళ్లారని చెప్పుకొచ్చారు. బొత్స వాదన విని ఇతరులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అడ్డంగా నరికేసి రోడ్డు మీద తిరిగితే నిర్దోషని సర్టిఫికెట్ ఇచ్చేటట్లుగా ఉన్నారన్న వాదనలు వినిపించాయి. చివరికి ఎమ్మెల్సీనే తానే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారని పోలీసులకు మీడియాకు సమాచారం లీక్ చేసిన తర్వాత ఎమ్మెల్సీపై చర్యల విషయంలో ఆలోచిస్తామని చెప్పుకొచ్చారు.
పార్టీ పరంగా ఎమ్మెల్సీపై చర్యల విషయంలో ఆయన చాలా తేలికగా మాట్లాడారు. అలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరించారు. ఏముంది.. అరెస్ట్ చేస్తే కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకుంటారన్నట్లుగా వైసీపీ నేతల మాటలు ఉన్నాయి. బొత్స వ్యవహారశైలి.. అచ్చంగా వైసీపీ స్ట్రాటజీని బయట పెడుతోందని.. నేరాలు చేసిన వారికి అసలు భయం లేకుండా చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తీరు వల్లే ప్రభుత్వంపై చెడ్డ పేరు వస్తుందని బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బొత్స అలా మాట్లాడటం వల్ల నేరస్తులకు కొమ్ముకాస్తూ ఆయన విలువను ఆయన తగ్గించుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. కానీ వైసీపీ నేతలు ప్రజల్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు.