ఏపీలో టీచర్ల నియామకాలు లేవు. ఉన్న వారు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి. విద్యార్థులకీ అదే దుస్థితి. విద్యారంగంలో ప్రభుత్వం తెచ్చిన రెండు జీవోలు 172, 117 అస్తవ్యస్థం చేస్తున్నాయి. పాఠశాలల విలీనం పేరుతో వేల స్కూళ్లను మూసేశారు. గ్రామాలలో ప్రాథమిక పాఠశాలల నుండి 3,4,5 తరగతులను తరలించేశారు. ఒక్క ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉంచారు. టీచర్ల నియామకాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వ లెక్క ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో టీచర్, స్టూడెంట్ నిష్పత్తి 1:30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:53, ఉన్నత పాఠశాలల్లో 1:60 చేశారు. ఒక్క టీచర్ అంత మంది పిల్లలకు ఎలా విద్యను అందించగలరో ప్రభుత్వమే ఆలోచించాల్సి ఉంది.
ఇది విద్యా వ్యవస్థకు ఎలా మేలు చేస్తుంది ? ఏపీలో 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల భర్తీ లేదు సరికదా…ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి పెంచి మిగులు పోస్టులను తేల్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా డీఎస్సీ అన్న అరుపులు ఇప్పటికీ నిరుద్యోగుల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలల్లోగల స్కూలు అసిస్టెంట్లను పూర్తిగా తొలగిస్తున్నారు. ప్రజలకు చదువు కావాలనే ప్రభుత్వం ఇలాగే చేస్తుందా? అన్న విమర్శలు విద్యారంగ నిపుణుల నుంచి వస్తున్నాయి. విద్య బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకునే సంస్కరణలను రూపొందిస్తున్నారు.
కామన్ స్కూలు ఎడ్యుకేషన్ మాటే లేదు. బడ్జెట్లో కోటాయింపులు అంతంత మాత్రం. మాతృ భాషలో బోధన లేదని చెప్పేశారు. ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆంగ్లంలోనే బోధన తప్పనిసరి చేశారు. బైజూస్ డీల్‌తో కార్పొరేట్ సంస్థల అధీనంలోనికి వెళతాయి. . ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తామని ఊరించి, ఇప్పుడు బడులలో పిల్లలు లేకుండా చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం అనుకున్నదే చేస్తోంది.
విద్య వ్యవస్థను మెరుగు పరచడం ఏంటే.. వేల కోట్లు పెట్టి బల్లలు, బెంచీలు, స్కూళ్లకు రంగులేయడమే కాదు అక్కడ చదువుకునేందుకు పిల్లలు కూడా వచ్చేలా చేయాలి. మంచి ఉన్నతమైన విద్య అందేలా చూడాలి. కానీ ప్రభుత్వం మౌలికమైన అవసరాన్ని మాత్రం మర్చిపోయింది.