సింగపూర్ కన్సార్టియంతో చంద్రబాబు ప్రభుత్వ ఒప్పందం ఐకానిక్ స్ట్రక్చర్ల కోసం తప్ప రాజధాని వారు కట్టేదేమీ లేదని గతంలోనే చెప్పుకున్నాం. నిన్న శంకుస్థాపనకు ముందు కుదుర్చుకున్న ఒప్పందంలోనూ అలాటి ప్రస్తావనలు లేవు. అయితే అన్నిటికన్నా హైలెట్ ఏమిటంటే ఎన్నికలలోగా ఏదో ఒకటి కట్టామనిపించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగానే కోరుకోవడం.అదేదో చమత్కారంలాగా అన్నా అందరూ నవ్వినా అసలు సారాంశం మాత్రం అదేనని అందరికీ తెలుసు. ఎన్నికల నాటికి రాజధాని కట్టడాలతో మురిపించాలి, కాని పెద్దగా కట్టకూడదు. అప్పుడే ప్రజలు అనుభవం గల చంద్రబాబైతే పూర్తిచేస్తాడని మరోసారి ఎన్నుకుంటారు. ఇది టిడిపి వ్యూహం. అలా అని ఏమీ చేయకపోతే భూములిచ్చిన రైతులలో సందేహాలు వస్తాయి. తమ భూముల రేట్లు పెరగడం లేదని అస్మదీయులు కూడా ఆందోళన పడిపోతారు. కాబట్టి ఏదో జరిగినట్టు కనిపిస్తుండాలి. కాకుంటే ఈ ఆదుర్దాలో ఒక విదేశీ నేతను ఎన్నికల్లోపు చేయండని అడగడం విచిత్రమే. రాజధాని నిర్మాణం టిడిపి అంతర్గత వ్యవహారం కాదు కదా! ఇప్పటికి ఆలస్యం కావడానికేమో కారణం ప్రతిపక్షాలట. రేపు కొద్దోగొప్పో పూర్తయితే ఆ ఘనత తను తీసుకుంటారట. ఎంత చిత్ర విచిత్ర తర్కం ఇది! ఈ విధంగా ప్రతిపక్షాలపై విదేశీ నేతలకు ఫిర్యాదు చేయడం కూడా అభ్యంతరకరమే. కాని హడావుడిలో వున్న ముఖ్యమంత్రి అవన్నీ పట్టించుకుంటారా? లోపల వున్నది బయిటకు వచ్చేస్తుంటుంది.