హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులందరినీ వచ్చే జూన్ నెలలోగా విజయవాడకు తరలిరావాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులను దశలవారిగా కాకుండా అందరినీ ఒకేసారి జూన్ నెలలోనే అమరావతికి తరలిస్తే బాగుంటుందని సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు యు. మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. కొన్ని శాఖలు ఉద్యోగులు హైదరాబాద్ లో మరికొన్ని శాఖలు ఉద్యోగులు విజయవాడలో ఉన్నట్లయితే ఫైల్స్ ప్రాసిసింగ్ లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అన్నారు. కనుక సచివాలయంలో అన్ని శాఖలను, ఉద్యోగులను అందరినీ ఒకేసారి జూన్ నెలలో అమరావతికి తరలించి అన్నిశాఖలు ఒకేచోట ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరుతామని తెలిపారు. అలాగే ఉద్యోగులు అందరికీ అమరావతిలో అధనంగా హౌస్ రెంట్ అలవెన్స్ మరియు ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు కేటాయించాలని కోరుతామన్నారు.
వచ్చే జూన్ 2నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ఇంతవరకు ఉద్యోగులు హైదరాబాద్ నుంచి విజయవాడ తరలివచ్చేందుకు ఇష్టపడటం లేదు. వారి సమస్యలు వారికి ఉండవచ్చును. కొన్నిశాఖలు ఒకచోట మరికొన్ని వేరే చోట ఉన్నట్లయితే ఫైల్స్ క్లియర్ చేయడం కష్టం అవుతుందని వారే చెపుతున్నారు. అటువంటప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు విజయవాడలో, సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ లో ఉంటే ఏవిధంగా పని జరుగుతుందని ఆలోచిస్తున్నట్లు లేదు. వారి సమస్యలు, వారి సౌకర్యాలు, వారి కోరికలే వారికి ముఖ్యం తప్ప ప్రభుత్వ సమస్య తమది కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అనేక మంది రైతులు తమ జీవనోపాధి అయిన పంట భూములను రాజధాని నిర్మాణం కోసం అర్పించి గొప్ప త్యాగాలు చేస్తుంటే, హైదరాబాద్ పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం 16 నెలలు గడిచిపోయినా ఇంకా విజయవాడ తరలిరావడానికి మొరాయిస్తూ, విజయవాడకు తరలిరావాలంటే తమకు అధనంగా హౌస్ రెంట్ అలవెన్స్ మరియు ఇళ్ళు కట్టుకోవడానికి అమరావతిలో ఇళ్ళ స్థలాలు కేటాయించాలని గొంతెమ్మ కోరికలు కోరుతుండటం చాలా దురదృష్టకరం. రైతులు తమ భూములను త్యాగాలు చేస్తే, ఆ భూములలో ఇళ్ళు కట్టుకోవడానికి తమకు స్థలాలు కేటాయించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుండటం చాలా విస్మయం కలిగిస్తుంది. ఇప్పటికయినా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని విజయవాడ తరలివస్తే వారికి గౌరవప్రదంగా ఉంటుంది.