ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘ నేతలు ఉద్యమం విరమిస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో వారు చెప్పారని కొద్ది రోజులుగా రోడ్డున పడి నిరసనలు చేస్తున్న ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. నిరసనలు చేపట్టి ఇంతకీ ఏం సాధించామని వారిలో వారు ప్రశ్నించుకుంటున్నారు. కానీ సమాధానం మాత్రం దొరకడంలేదు. కనీసం పీఆర్సీ నివేదికను సాధించలేకపోయారు. అసలైన పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఇంత వరకూ బయటపెట్టలేదు. పీఆర్సీ నివేదిక పేరుతో కార్యదర్శుల కమిటీ నివేదికను మాత్రం బయట పెట్టారు. దాన్ని చూపించి ఉద్యోగుల జీతాలు తగ్గిస్తామని బెదిరిస్తున్నారు. ఆ పేరుతో చర్చలు జరుపుతున్నారు.
ఇక సీపీఎస్ రద్దు గురించి పూర్తిగా మడమ తిప్పేశారు. జగన్ తెలియక హామీ ఇచ్చారని సజ్జల స్పష్టం చేశారు. ఇతర 70 సమస్యల్లో ఏ ఒక్క దానికి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించలేదు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ఉద్యమం విరమించేశారు. అన్నింటికీ కాల పరిమితి పెట్టుకుని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హామీ ఇచ్చారని అందుకే.. ప్రభుత్వం కోసం.. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విరమించుకుంటున్నామని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆందోళనలు చేశారా అన్న డౌట్ ఈ కారణంగా ఇతర ఉద్యోగుల్లో వస్తోంది.
హామీలు నెరవేరుస్తారా.. గద్దె దిగుతారా అంటూ చెలరేగిపోయిన కొంత మంది హఠాత్తుగా ఉద్యోగుల ప్రయోజనాలను పణంగా పెట్టడానికి కారణం ఏమిటన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన అని…. ఆ అంశాన్ని పూర్తిగా గందరగోళంలోకి నెట్టేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఉద్యోగులు మరింత ఊబిలోకి కూరుకుపోయారు. ఈ చర్చలు ఇలా సాగుతూనే ఉంటాయి. వారి ప్రయోజనాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి. సమస్యలు పరిష్కరించడం లేదని మరోసారి నేతలు ఉద్యమం అంటే.. సొంత ఉద్యోగులే నమ్మని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదే.