ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం అయింది. ఇటీవల జరిగిన చర్చల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా… బొత్స, సజ్జల అవమానించినా సరే ఇప్పుడు ఉద్యమం ఆపేస్తున్నట్లుగా ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు ప్రకటించారు.
తమకు రావలసిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చిందని ఆయన చెబుతున్నారు. అందుకే ఈనెల 27న రాష్ట్ర జేఏసీ తలపెట్టిన “బి ఆర్ టి ఎస్ మహా ఆందోళన” వాయిదా వేసినట్లు ప్రకటించారు.
ఉద్యోగులు మధ్యంతర భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ సత్వరమే 12వ పీఆర్సీ ప్రయోజనాలు కల్పిస్తామని చెబితే నమ్మేశారట. పీఆర్సీ కమిషన్ వేసిన ఎనిమిది నెలలకు ఉద్యోగుల్ని కేటాయించారు. మరో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఇరవై ఒక్క వేల కోట్లు ఉద్యోగులకు ప్రభుతవం బకాయి ఉంది. ఈ బకాయిల గురించి మాత్రం బండి శ్రీనివాసావు చెప్పలేదు. ఉద్యోగుల వైద్య ఖర్చుల నిమిత్తం ఆసుపత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో 70 కోట్లు, సిపిఎస్ ఉద్యోగులకు టీఏ, డి ఏ ల నిమిత్తం చెల్లించాల్సిన మొత్తంలో 100 కోట్లు వీలైనంత త్వరగా ఇస్తామని ప్రభుత్వం చెప్పిందట.
మార్చి నెలాఖరు నాటికి పూర్తిగా నెరవేరుస్తుందనే ఆశాభావంతో తమ ఆందోళన తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. 27వ తేదీన తలపెట్టిన మహా ఆందోళన కార్యక్రమానికి హాజరుకాకుండా ఉండేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉద్యోగ సంఘ నేతలను పోలీసులు అక్రమ కేసులు పెడతామని బెదిరించడాన్ని, కొంతమంది ఉద్యోగులను అదుపులోకి తీసుకోవదాన్ని ఖండిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఉద్యోగ సంఘ నేతల వల్ల.. . ఏ ప్రభుత్వం వద్ద కూడా ఇక ఉద్యోగులకు విలువ ఉండే అవకాశం లేకుండా పోయింది. వారి హక్కులు ఇక గాల్లో దీపాలే.