ఒకప్పుడు జీతాలు ఒకటో తేదీన వచ్చేవి. రావాల్సిన ప్రయోజనాలు.. అదనంగా కావాల్సిన బెనిఫిట్లు.. ఓ రకంగా చెప్పాలంటే గొంతెమ్మ కోరికల కోసం ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేసేవాళ్లు. పోరాటాలు చేసేవాళ్లు. అయితే ఇప్పుడు జీతాల కోసం రోడ్డెక్కుతామంటూ ప్రకటనలు చేస్తున్నారు. జీతాల కోసం ఎదురు చూసేలా చేస్తున్నారని.. ఒకటో తేదీన జీతాలివ్వకపోతే రోడ్డెక్కుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విజయవాడలో తోటి ఉద్యోగ సంఘ నేతలతో సమావేశమైన బొప్పరాజు వెంకటేశ్వర్లు.. అర్జంట్‌గా జీతాల సమస్యపై జగన్ సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాలు తో చర్చ చేసి హామీ ఇవ్వాలని,అధికారులు, మంత్రి వర్గ ఉప సంఘం హామీ ఇవ్వలేక పోతుందన్నారు.సిఎం స్వయంగా వీటి పై స్పందించాలని బొప్పరాజు డిమాండ్ చేస్తున్నారు. జీతాలు ఇవ్వకపోగా.. తాము దాచుకున్న జీపీఎఫ్ లాంటి సొమ్ములు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేసుసుకున్నారని.. ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వడం లేదని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన రోజే బెన్ ఫిట్స్ ఇచ్చి పంపాలని నిబంధన ఉందని, అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో రిటైర్ అయిన ఉద్యోగులు మధన పడుతున్నారని ఆయనంటున్నారు.
ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోతే, సంక్రాంతి తరువాత ప్రత్యక్ష కార్యాచరణ కు దిగుతామని బొప్పరాజు చెబుతున్నారు. అయితే ముహుర్తాలు పెట్టుకుని చేసే ఉద్యమాలు ఏ రేంజ్‌కు వెళ్తాయో గతంలోనే ఈ ఉద్యోగ సంఘ నేతలు చెప్పారు. సమ్మె వరకూ వెళ్లి.. ఎలాంటి ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి పొందకుండానే… కాడి దింపేశారు. తోటి ఉద్యోగుల్ని నట్టేట ముంచారు. ఈ ఉద్యోగ నేతలు మాత్రం హాయిగానే ఉన్నారు.